జిల్లాలో పుష్కర శోభ
జిల్లాలో పుష్కర శోభ
Published Thu, Aug 11 2016 9:32 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
ఘాట్‌లు, పుష్కర నగర్‌ల వద్ద ఏర్పాట్లు పూర్తి
విద్యుత్ కాంతులతో వెలుగొందుతున్న నగరం
ఆకట్టుకున్న శోభా యాత్ర
నేటి ఉదయం నుంచే పుణ్య స్నానాలు
సాక్షి, అమరావతి : జిల్లా పుష్కర శోభ సంతరించుకొంది. శుక్రవారం ఉదయం నుంచి ఘాట్‌లలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక అధికారులు ఘాట్‌లను, తుది ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని ఘాట్‌లలో మూడు షిప్టుల్లో విధులు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేకాధికారులు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే అన్ని ఘాట్‌ల వద్ద గజ ఈతగాళ్లు, ఫైర్, శానిటేషన్, విద్యుత్, నీటిపారుదల, ఆర్‌డబ్ల్యూస్, మెడికల్ సిబ్బందిని సిద్ధం చేసి ఉంచారు. పుష్కరనగర్‌ల నుంచి ఘాట్‌ల వరకు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. అన్ని ఘాట్‌లు, పుష్కర నగర్‌ల వద్ద పటిష్ట బందోబస్తును గురువారం రాత్రి నుంచే సిద్ధం చేసి ఉంచారు. గుంటూరు జిల్లాలో నదితీరం వెంబడి ఘాట్ పరిసర ప్రాంతాలు కొత్త కాంతులతో వెలుగొందుతున్నాయి. ఘాట్‌ల వద్దకు శుక్రవారం ఉదయం నుంచి కృష్ణా జలాలు పుష్కలంగా చేరుతాయని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజి వద్ద కృష్ణమ్మకు అడ్డుకట్ట వేయడంతో కింది ప్రాంతంలో ఉన్న ఘాట్‌లకు నీటి సమస్య తలత్తే అవకాశం ఉంది. ట్రాఫిక్‌ను పోలీసులు ఎక్కడికక్కడ క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు, పుష్కరనగర్‌లో పార్కింగ్ ప్రదేశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నారు. పుష్కర నగర్‌లలో భక్తులకు ఉచిత అన్న ప్రసాదం శుక్రవారం ఉదయం నుంచే అందేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆ మూడు ఘాట్లపైనే ఫోకస్...
జిల్లాలో అమరావతి, సీతానగరం, పెనుమూడి ఘాట్‌లపైనే దృష్టి పెట్టారు. కలెక్టర్ కాంతిలాల్ దండే ఘాట్‌లను పలుమార్లు పరిశీలించి అక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ ఘాట్‌ల ఏర్పాట్లపై ఆరాతీసినట్లు సమాచారం. సీఎం అమరావతి ఘాట్‌ను సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఎక్కువ శాతం భక్తులు ఈ ఘాట్‌లలో స్నానాలు చేసేందుకు వస్తారని, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. దీనికితోడు తాళ్ళాయపాలెం ఘాట్‌కు భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుదని అంచనా వేస్తున్నారు. అలాగే నాగార్జున సాగర్‌వైపు కృష్ణవేణి ఘాట్‌కు భక్తుల తాకిడి ఉంటుందని అ«ధికారులు పేర్కొన్నారు.
కళాకారులతో శోభా యాత్ర...
జిల్లాలో పుష్కరాల సన్నాహకాలలో భాగంగా గుంటూరు నగరంలో గురువారం శోభా యాత్ర నిర్వహించారు. జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా విభిన్న వేషదారణలతో వందలాదిమంది కళాకారులు శోభాయాత్రలో పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద శోభాయాత్ర ప్రారంభమైంది. మంగళ, డప్పు వాయిద్యాలతో కళాకారులు సందడి చేశారు. చెక్కభజన, విద్యార్థుల సాంస ్కతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. నగరంలో విద్యుత్ కాంతులకు తోడు కళాకారుల ప్రదర్శనలు పుష్కర శోభను తెచ్చాయి.
Advertisement
Advertisement