పుష్కర ఘాట్లే టూరిజం పాయింట్లు
విజయవాడ (భవానీపురం) :
పుష్కర ఘాట్లను భవిష్యత్‌లో టూరిజం పాయింట్లుగా తీర్చిదిద్దుతామని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని)తో కలిసి ఆయన భవానీపురంలోని పున్నమీ ఘాట్‌ను శనివారం సందర్శించారు. ఘాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ నగరాన్ని ప్రజలు ఊహించని రీతిలో సుందరీకరణ చేస్తున్నారన్నారు. రూ.850 కోట్ల ఖర్చుతో రివర్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పుష్కరఘాట్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇంద్రకీలాద్రి, అర్జున వీధిని కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. విజయవాడ నగరం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తయారవుతుందన్నారు. ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, బోడె ప్రసాద్, టీడీపీ అర్బన్ ప్రధాన కార్యదర్శి గన్నె నారాయణ ప్రసాద్, కార్పొరేటర్లు జి.హరిబాబు, షేక్ హబిబుల్లా, ఉమ్మడి వెంకటేశ్వరరావు, సీహెచ్ గాంధీ ఉన్నారు.
పుష్కర యాత్రికులకు ప్రత్యేక బస్సులు
కృష్ణా పుష్కరాల సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు తెలిపారు. శనివారం ఆయన పున్నమి ఘాట్‌ను సందర్శం చారు. ఏయే ఘాట్లకు ఎంతమంది యాత్రికులు వస్తారో పోలీస్ అధికారులతో మాట్లాడి దాని ప్రకారం బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఆరు శాటిలైట్ బస్‌స్టేషన్లు ఉన్నాయని, తద్వారా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. గత ఏడాది గోదావరి పుష్కరాల్లో చోటుచేసుకున్న ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికతో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పర్యటనలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, ఆర్‌ఎం రామారావు, డెప్యూటీ సీటీఎం శ్రీరామ్ పాల్గొన్నారు.