బూడిదపాడు ఘాట్ వద్ద కానరాని నీళ్లు
నిర్మించినా.. నిరుపయోగమే!
Published Fri, Aug 26 2016 11:10 PM | Last Updated on Wed, Aug 29 2018 7:09 PM
– రూ.13కోట్లతో 7ఘాట్లు
– రూ.17కోట్లతో రహదారులు
– 2చోట్ల మాత్రమే ఉపయోగం
కృష్ణా పుష్కరాల్లో భాగంగా పెబ్బేరు మండలంలో మొత్తం ఏడు ఘాట్లు నిర్మించారు. ఇందులో కేవలం రెండు చోట్ల మాత్రమే యాత్రికులు అధిక సంఖ్యలో రాగలిగారు.. రూ.లక్షలు ఖర్చు పెట్టి ఆయా చోట్ల మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ఇతర సదుపాయాలు కల్పించారు.. రోడ్లు నాసిరకంగా ఉండటంతో పుష్కరాలకు ముందే దెబ్బతిన్నాయి.
పెబ్బేరు : మండలంలోని రంగాపూర్ వీఐపీ ఘాట్ రూ.6.15కోట్లతో, మునగమాన్‌దిన్నె రూ.మూడు కోట్లు, తిప్పాయిపల్లి రూ.1.2కోట్లు, యాపర్ల రూ.96లక్షలు, బూడిదపాడు రూ.60లక్షలు, గుమ్మడం రూ.21 లక్షలు, రాంపూర్ ఘాట్ రూ.87లక్షలు ఇలా మొత్తం రూ.13కోట్లతో పుష్కరఘాట్లు నిర్మించారు. రూ.17కోట్లతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రోడ్లు నిర్మించారు. రూ.లక్షలు వెచ్చించి మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ఇతర సదుపాయాలను అధికారులు కల్పించారు. అయితే పుష్కరాల ప్రారంభం నాటికి జూరాల వరదనీరు భారీగా రావడంతో కేవలం రంగాపూర్, రాంపూర్, మునగమాన్‌దిన్నె ఘాట్ల వద్ద మాత్రమే భక్తులకు స్నానాలు చేసేందుకు వీలయింది. రెండు రోజుల తర్వాత నుంచి రాంపూర్ ఘాట్‌కు నీళ్లు లేకపోవడంతో చివరి వరకు లక్షలాది మంది భక్తులు రంగాపూర్, మునగమాన్‌దిన్నె ఘాట్లకు వెళ్లి పుష్కరస్నానాలు ఆచరించారు. దీంతో బూడిదపాడు, యాపర్ల, తిప్పాయిపల్లి, గుమ్మడం, రాంపూర్ ఘాట్లు నిరుపయోగంగా మారాయి. రోడ్లు నాసిరకంగా ఉండటంతో పుష్కరాలకు ముందే దెబ్బతిన్నాయి. హైవే నుంచి రాంపూర్ ఘాట్‌కు వెళ్లే రోడ్డును పంచాయతీరాజ్ అధికారులు ఏకంగా అలైన్‌మెంట్‌నే మార్చేసి బీటీ స్థానంలో సీసీ మాత్రమే నిర్మించారు.
అసంపూర్తిగా..
వీఐపీలకు వసతి కల్పించేందుకుగాను పెబ్బేరు పీజేపి అతిథి గహం మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.1.5కోట్లు విడుదల చేసింది. అందులోని గదులు, ఏసీలు, రంగులు, బెడ్‌లు తదితర పనులను మాత్రమే కాంట్రాక్టర్లు హడావుడిగా చేశారు. దీని ముందు టైల్స్, గార్డెన్, మరో నాలుగు ఏసీలు, ఎస్‌ఈ, ఈఈ క్వార్టర్ల మరమ్మతు, అంతర్గత బీటీరోడ్లు తదితర పనులను చేపట్టలేదు. ఇక చేసిన పనులను అసంపూర్తిగా, మిగిలినవి పుష్కరాల నాటికీ ప్రారంభించకపోవడం అధికారుల పర్యవేక్షణ తీరుకు అద్దం పడుతోంది.
Advertisement