-
భారీగా పోలీసు బలగాల మోహరింపు
-
తెల్లవారుజాము 4.30 గంటల నుంచే తొలగింపు ప్రక్రియ ప్రారంభం
-
ఆందోళనకు దిగిన మహిళలు
కాకినాడ వైద్యం : కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న మదర్ అండ్ చైల్డ్ హెల్త్ బ్లాకు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ నడుంబిగించారు. ఆస్పత్రి వెనుక సుమారు 1.5 ఎకరా స్థలంలో ఉన్న నాలుగో తరగతి ఉద్యోగుల పాత క్వార్టర్స్‌లోని కట్టడాల తొలగింపు, సిబ్బంది తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని, నగరపాలక సంస్థ, పోలీస్‌లను ఆదేశించారు. ఈ మేరకు కాకినాడ ఆర్డీవో అంబేద్కర్ ఆధ్వర్యంలో డీఎస్పీ ఎస్. వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి పాత క్వార్టర్ వద్ద భారీ పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఈ సందర్భంగా పాతబస్టాండ్ నుంచి వార్ఫ్‌రోడ్డు మీదుగా టీబీ వార్డు విభాగం దాకా రోడ్డును పోలీసులు దిగ్బంధించారు. నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన పొక్లెయిన్, బుల్‌డోజర్లతో పాకలు, పాత కట్టడాల తొలగింపు ప్రారంభించారు.
ఉన్నపళంగా పొమ్మంటే ఎలా?
అధికారులు, పోలీసులతో సిబ్బంది తీవ్ర వాగ్వాదానికి దిగి ఉన్నట్టుగా పిల్లా, పాపలతో బయటకు వెళ్లిపోవాలంటే ఎక్కడికి వెళతామని మహిళలు వాదించారు.
ఏడాదిగా ఖాళీ చేయాలని కోరుతున్నాం..
ఏడాదిగా క్వార్టర్లు ఖాళీ చేయాలని కోరామని, ఇప్పటికి మూడు సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి, రాగంపేటలో 4,600 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం భూమిని సేకరించామని, అందులో ఇళ్ల స్థలాలిచ్చి, హౌసింగ్‌తో ఇళ్లు నిర్మించి ఇస్తామని కమిషనర్ చేత లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిన విషయాన్ని మరచిపోవద్దని అధికారులు స్పష్టం చేశారు. అప్పటి దాకా తాత్కాలిక షెడ్లను రాగంపేటలో నిర్మించామని, అక్కడకు తరలి వెళ్లాలని కోరారు. అయితే డ్రెయి¯ŒSపై నిర్మించిన తాత్కాలిక షెడ్లు పిచ్చుకగూళ్లను తలపిస్తున్నాయని, అక్కడకు వెళ్లబోమని నివాసులు భీష్మించారు. ఈ దశలో ఇక్కడ నివసించే వారందరూ ప్రభుత్వ ఉద్యోగులమన్న సంగతి మరచిపోరాదని, జిల్లా ప్రజానీకానికి ఉపయోగపడే ఆస్పత్రి అభివృద్ధికి అడ్డుపడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. అనంతరం తీవ్ర వాగ్వాదం నడుమ పొక్లెయి¯ŒSతో కట్టడాల తొలగింపు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్వార్టర్ల నుంచి ఖాళీ చేయించిన సిబ్బంది సామాన్లను నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ట్రాక్టర్లపై వారి గృహాలకు తరలించారు. కాకినాడ డీఎస్పీ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్సైలు, పోలీస్ కానిస్టేబుళ్లు, ప్రత్యేక బలగాలు పాల్గొన్నారు.
అందరికీ ఇళ్లు..
పాత క్వార్టర్‌లో నివాసం ఉంటున్న 46 కుటుంబాలకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్డీవో తెలిపారు. 46 కుటుంబాల్లో 26 మంది ఆసుపత్రిలో రెగ్యులర్ ఉద్యోగులు కాగా, 14 మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించామన్నారు. మిగతా 6 గురు సిబ్బంది బంధువులు ఉన్నట్లు తెలిపారు.
390 పడకలు
అందుబాటులోకి వస్తాయి
రూ.40 కోట్ల వ్యయంతో జీజీహెచ్‌లో నిర్మించనున్న మదర్ అండ్ చైల్డ్ హెల్త్ బ్లాకు నిర్మాణం జరిగితే 390 పడకలు అందుబాటులోకి వస్తాయని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వై.నాగేశ్వరరావు తెలిపారు. భవన నిర్మాణ పనులకు ఎనిమిది నెలల కితం వైద్య,ఆరోగ్యమంత్రి డా.కామినేని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా హెచ్‌ఆర్‌ఏ తీసుకంటూ 2011 సంవత్సరం నుంచి క్వార్టర్‌లోనే నివాసం ఉంటున్న 26 మంది సిబ్బందికి ఉన్నతాధికారుల ఆదేశాలపై నోటీసులు ఇచ్చామన్నారు. ఆసుపత్రి అభివృద్ధిని దృష్టిని పెట్టుకుని సహకరించాలని కోరారు.