ఉత్సాహంగా పోలీస్ సెలెక్షన్స్
ఉత్సాహంగా పోలీస్ సెలెక్షన్స్
Published Fri, Dec 23 2016 10:19 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
కాకినాడ క్రైం :
జిల్లా పోలీస్ పెరేడ్ మైదానం మహిళలతో కిటకిటలాడింది. పలు రకాల రంగుల ట్రాక్ సూట్‌లతో బృందాలుగా ఏర్పడి హుషారుగా పోలీస్ మైదానంలోకి తరలివచ్చారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేపట్టేందుకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొని తమ సత్తా చాటారు. 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగును నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేశారు. ఇక లాంగ్ జంప్ విషయానికి వస్తే కళ్లు మిరిమిట్లు గొలిపేలా పరుగెత్తుకొచ్చి రివ్వున గాల్లోకి ఎగురుతూ సునాయాసంగా లక్ష్యాన్ని సాధించారు. కాకినాడ పోలీస్ పెరేడ్ మైదానంలో నాలుగు రోజులుగా జరుగుతున్న పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా శుక్రవారం మహిళా అభ్యర్థులకు ఏఎస్పీ ఏఆర్ దామోదర్ ఆధ్వర్యంలో జరిగాయి. మూడో రోజు నిర్వహించిన పరీక్షల్లో 754 మంది అర్హత సాధించినట్టు తెలిపారు. నాలుగోరోజు నిర్వహించిన పరీక్షల్లో 1,101 మహిళలు హాజరు కావాల్సి ఉండగా, 723 మంది పాల్గొన్నారన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఒరిజినల్ సర్టిఫికెట్ల స్కానింగ్ ప్రక్రియ ఆలస్యం కాకుండా ఏఎస్పీ ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ఈవెంట్ల నిర్వహణ సజావుగా జరిగి మహిళలు ఊపిరిపీల్చుకున్నారు. ఈవెంట్లలో పాల్గొనేందుకు వచ్చిన మహిళలు తమ బంధువులను వెంటబెట్టుకుని పోలీస్ పెరేడ్ మైదానానికి వచ్చారు.
మహిళల్లో ఉత్తేజాన్ని నింపిన పోలీస్‌లు
నీ చూపు లక్ష్యంపై పెట్టు, ఒకటో లైన్లో అమ్మాయి స్పీడు పెంచు, రెండో లైన్లో అమ్మాయి ఇంకా జోరు పెంచాలి. అయిదో లైన్లో అమ్మాయి బాగా వెనకబడిపోయావు రెండు చేతులు ఊపుతూ లక్ష్యాన్ని అధిగమించంటూ మహిళా అభ్యర్థులను పోలీస్‌లు ప్రోత్సహించారు. పరుగు పందెంలో పోలీస్‌లిచ్చిన ప్రోత్సాహంతో ఎక్కడలేని ఓపిక తెచ్చుకున్న మహిళలు లక్ష్యాన్ని అధిగమించడం కనిపించింది. పరుగులో అలసటకు లోనైన పలువురిని మహిళా పోలీసులు చేరదీసి సేవలందించారు.
దేహదారుఢ్య పరీక్షల్లో 723 మంది పాల్గొన్నారు.ఫైనల్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల మనోగతం ఇలా ఉంది.
ఒరిజినల్ సర్టిఫికెట్ల లేక నిరాశగా అభ్యర్థులు వెనక్కి
దేహదారుఢ్య పరీక్షల్లో తప్పనిసరిగా అభ్యర్థుల అర్హతలను తెలియజేసే ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకురావాలని ముందుగా జిల్లా ఎస్పీ తెలిపినా కొంతమంది మహిళా అభ్యర్థులు వాటిని తీసుకురాకపోవడంతో సమస్య తలెత్తింది. పత్రాల పరిశీలన సందర్భంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకపోవడంతో ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో అభ్యర్థులు నిరాశకు లోనయ్యారు. ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత ఉన్నత చదువులు కొనసాగించేందుకు వీలుగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను కళాశాలల్లో ఇచ్చామని, దాంతో సమయానికి వెంట తీసుకురాకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఓఎస్డీ వై.రవిశంకరరెడ్డితో పాటూ పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌సైలు, రిజర్వు పోలీస్ అధికారులు, మహిళా పోలీస్‌లు బందోబస్తు నిర్వహించారు.
నాన్న ప్రోత్సాహంతో....
నాన్న ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తూ కష్టపడి చదివిస్తున్నాడు. నేను ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన తర్వాత డీఎడ్ పూర్తి చేశా. కొద్ది మార్కుల తేడాతో ఉపాధ్యాయ ఉద్యోగం తప్పిపోయింది. రెండో ప్రయత్నంగా నాన్న,అన్నయ్యల ప్రోత్సాహంతో మహిళా పోలీస్ పోస్టుకి దరఖాస్తు చేశా. నలభై అయిదు రోజులుగా జగన్నాథపురం జీపీటీ పాలిటెక్నిక్ కళాశాలలో సాయంత్రం గంటన్నరసేపు పరుగు, ఈవెంట్లపై ప్రాక్టీసు చేస్తున్నా. రెండో దశలో జరిగిన దేహదారుఢ్య పరీక్షల్లో పాసయి, ఫైనల్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించా.
– వారుపిల్లి పద్మ, తూరంగి డ్రైవర్స్‌కాలనీ
అభిరుచిని తెలుసుకుని...
నా భర్త శివకుమార్ కర్నూలు సెంట్రల్ జైల్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. రెండేళ్ల కిందట మాకు వివాహం జరిగింది. నాకు పోలీస్ ఉద్యోగం అంటే ఇష్టం. నాభర్త నా అభిరుచిని తెలుసుకుని ప్రత్యేక శిక్షణకు పంపారు. కష్టపడి చదవడం, ఈవెంట్లలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో ప్రిలిమినరీ, దేహదారుఢ్య పరీక్షల్లో రాణించగలిగా. ఫైనల్ పరీక్షలో తప్పకుండా విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది.
– సీహెచ్.స్వాతి, రాజమండ్రి
Advertisement
Advertisement