తపన,సాధన కళకు రెండు కళ్లు
రాయనైనా కరిగించల శక్తి ఆయన సంగీతానికి ఉంది. ఎంతటి దుఃఖంలో ఉన్నా ఆయన స్వరాలు మనసు ఉత్తేజంతో తేలికపడుతుంది.
-
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా....
-
గీతంలో డిలిట్ డాక్టరేట్
విశాఖ–కల్చరల్ : రాయనైనా కరిగించల శక్తి ఆయన సంగీతానికి ఉంది. ఎంతటి దుఃఖంలో ఉన్నా ఆయన స్వరాలు మనసు ఉత్తేజంతో తేలికపడుతుంది. వినసొంపైన స్వరాలను ఏరికూర్చి పాటల మాలను కట్టే మ్యూజిక్ మాస్ట్రో పద్మభూషణ్ ఇళయారాజా. గీతం వర్శిటీలో గౌరవ డాక్టర్ రేట్ తీసుకోడానికి విశాఖ విచ్చేసిన సందర్భంగా ఆయనను కలసి పాత్రికేయులతో కొద్దిసేపు ముచ్చటించారు.
కళల పట్ల మనస్సులో తపన ఉండాలి. మనిషి నిత్యజీవితంలో అది ఏ స్థాయికి తీసుకెళ్తోందో మనకు తెలియదు. నేను పుట్టింది గ్రామీణ ప్రాంతంలోనైనా కన్న కలలతోనే నేడు జాతీయ స్థాయికి ఎదగగలిగాను. నేర్చుకోబోయే ఏ కళనైనా చూసి భయపడకూడదు. మొదట్లో నా చేతిలో ఏమీ లేదు..ఉట్టిచేతులతోనే సంగీతాన్ని నేర్చుకున్నా..ఆ అకుంఠత దీక్షతో సాధన చేశా. నిత్య సంగీత సాధకుడిగా మన సంగీతానికి పాశ్చాత్య సంగీతాన్ని మేళవిస్తూ చక్కని బాణీలు కూర్చడం నేర్చుకున్నాను.
నిద్రలో కూడా...
నిద్రలో కూడా చేతులు వేళ్లు కదుపుతుంటే మా అమ్మ అదేంట్రా..నిద్రలోకూడా పాడేస్తున్నావా..?అనేదని గుర్తు చేసుకున్నారు. తొలినాళ్లలో తాను రూపొందించిన సింధుభైరవి, సాగరసంగమం చిత్రాల గీతాలు నేటికీ ప్రజల హదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవడం విశేషమన్నారు.
1976 నుంచి తెలుగులో...
1976లో జయప్రద నటించిన ‘భద్రకాళి’అనే తెలుగు చిత్రంలోని ‘చిన్నిచిన్ని కన్నయ్య’అనే పాటకు సంగీతాన్ని అందించి మ్యూజిక్ డైరెక్టర్‌గా సినీరంగ ప్రవేశం చేశాను. తన సినీ జీవితంలో ఇప్పటి వరకు ఐదుసార్లు తెలుగు, తమిళం, మళయాళం చిత్రాలకుగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులను అందుకున్నా. 2015 అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో జీవిత సాఫల్య పురస్కారాన్ని స్వీకరించాను. 1993లో లండన్‌లోని రాయల్ ఫిలార్మోనిక్ ఆర్కెస్ట్రాలో పూర్తిస్థాయి సింఫనిపై రాగాలు పలికించి తొలి భారతీయ స్వరకర్తగా గుర్తింపు పొందాను. చలన చిత్రాలకు సంగీతాన్ని అందించడంతోపాటు పాశ్చాత్య సంగీతంతో భారతీయ శాస్త్రియ సంగీతాన్ని మేళవించి ప్రయోగాలను చేశాను. ‘పంజముగి’ అనే సరికొత్త రాగాన్ని సంగీత ప్రియులకు అందించడం గర్వకారణంగా ఉందన్నారు. తాను తయారు చేసిన ‘హౌటు నేమ్ ఇట్’,‘నథింగ్ బట్ విండ్’ సినిమాయేతర ఆల్బమ్‌లు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయన్నారు. ప్రయోగాత్మక సంగీత విభాగంలో సంగీత నాటక అకాడమి అవార్డు లభించాయన్నారు. ఇప్పటి వరకు 16 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయని, 1988లో తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామని’ అవార్డుతో గౌరవించగా, ఈ ఏడాది కేరళ ప్రభుత్వం నుంచి నిషాంగంధి పురస్కారంతో సన్మానించిందన్నారు. హూస్టన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘విశ్వతులసి’చిత్రానికి ‘గోల్డెన్ రెమి’అవార్డును అందుకున్నానన్నారు. 2010 సంవత్సరంలో భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ అవార్డుతో గౌరవించిందని, నేడు గీతం విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో గౌరవించడం గర్వంగా ఉందన్నారు.
ఐదు జాతీయ అవార్డులు
తన 1000వ చిత్రంగా తారై తప్పెటై్ట సినిమాకు ఉత్తమ నేపథ్య సంగీత విభాగంలో జాతీయ అవార్డు లభించిందని, ఇది నా సంగీత విభాగంలో సాధించిన ఐదో జాతీయ అవార్డ్ అని పేర్కొన్నారు. గత 1984లో సాగరసంగమం, 1989లో రుద్రవీణ లాంటి తెలుగు చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నానని ఇళయరాజా చెప్పారు.