
ఇప్పటికీ జాంపండు అని పిలుస్తుంటారు
కొవ్వూరు : కామెడీ, విలన్, క్యారెక్టర్ పాత్రలతో 300 సినిమాల మైలు రాయిని దాటేశానని సినీ నటుడు రఘుబాబు అన్నారు. కొవ్వూరు మండలం నందమూరులో ‘చుట్టాలబ్బాయి’ సినీ షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు.
ప్రశ్న: జనంలోకి వచ్చినపుడు మీరు నటించిన సినిమాలో పేరుతో పిలిస్తే ఎలా ఉంటుంది ?
రఘుబాబు : చాలా ఆనందంగా ఉంటుంది. పాత్ర అంతగా ప్రేక్షకులను మెప్పించిందని చెప్పవచ్చు. ఇప్పటికీ తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో జాంపండు అని పిలుస్తుంటారు.
ప్రశ్న: మీ తండ్రి గిరిబాబు సినీ వారసత్వం పనిచేసిందా..?
రఘుబాబు : వారసత్వం అనేది నేను ఎవరు అని చెప్పడానికే పనికి వస్తుంది. టాలెంట్ ఉంటేనే ఇక్కడ రాణించగలం. ఒక్క మాట చెప్పాలి. నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో మా అమ్మగారు నాన్నతో వాడు ఏదో సినిమాల్లో చేస్తున్నాడుగా, మీరు ఎవరికైనా రికమెండు చెయ్యండి అన్నారు. నాకు ఎవరు రికమెండు చేశారు అని నాన్న ఎదురు ప్రశ్న వేశారు.
ప్రశ్న: మీ ఫిజిక్‌కు చేసే పాత్రలకు సంబంధం ఉందా ?
రఘుబాబు : దర్శకులను గాని నిర్మాతలను గాని ఫలానా పాత్ర ఇవ్వండి అని నేను ఎవ్వరినీ అడగలేదు. రఘబాబు ఏ పాత్రకు నప్పుతాడు అని వారు భావించి ఇచ్చిన పాత్రలను చేసుకుంటూ వెళుతున్నా. ఎప్పటికైనా ఫుల్ లెంగ్త్ ఎమోషన్, పాజిటివ్ పాత్రల్లో నటించాలని ఉంది.
ప్రశ్న : ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు ?
రఘుబాబు : చుట్టాలబ్బాయి, సర్ధార్ గబ్బర్‌సింగ్, సుప్రీం, బాబు బంగారం, లచ్చి, మావూరి రామాయణం, టైటానిక్‌తో పాటు తెలుగు, కన్నడంలో మాజీ ప్రధాని దేవగౌడ మనవడు నిఖిల్‌గౌడ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో నటిస్తున్నా. ఇప్పటి వరకు 300 సినిమాలు పూర్తిచేశాను.