'క్షమాపణ చెప్పాకే అనంతలో అడుగుపెట్టాలి'
అనంతపురం: రాష్ట్ర విభజనపై క్షమాపణ చెప్పిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ జిల్లాలో అడుగుపెట్టాలని అనంతపురం నగర ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి డిమాండ్ చేశారు. శుక్రవారం అనంతపురంలో ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో ల్యాండ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కబ్జాలకు పాల్పడితే టీడీపీ నేతలను కూడా ఉపేక్షించమన్నారు. గోదావరి పుష్కరాలు బాగా జరగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారని తెలిపారు. పుష్కరాల విశిష్టతను చాటి చెప్పేందుకు ఆయన ప్రయత్నించారని చెప్పారు. పుష్కరాల సందర్భంగా రాజమండ్రి కోటగుమ్మం పుష్కరఘాట్లో తొక్కిసలాట సందర్భంగా మృతి చెందిన వారి అంశాన్ని రాజకీయం చేయడం తగదన్నారు.
రాహుల్ గాంధీ జులై 24వ తేదీన అనంతపురం జిల్లాలోని మడకశిర, ఓబులదేవరచెరువుల్లో పర్యటించనున్నారు. ఆయా గ్రామాల్లో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. అదికాక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటిసారిగా రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ వస్తున్న సంగతి తెలిసిందే.