కార్పొరేట్ చేతికి రైల్వేస్టేషన్
- స్విస్ చాలెంజ్ పద్ధతిలో డెవలపర్ ఎంపిక
- ప్రపంచస్థాయి స్టేషన్‌గా అభివృద్ధి అంటూ ప్రచారం
- స్టేషన్‌లోనే మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్స్ నిర్మాణం
- కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ అంటున్న కార్మిక సంఘాలు
- 8న సికింద్రాబాద్‌లో ప్రీ–టెండర్ బిడ్‌కు సన్నాహాలు ?
సాక్షి, విజయవాడ: విజయవాడ రైల్వే స్టేషన్‌ను కొర్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఆధునికీకరణ పేరుతో దేశంలోని 27 రైల్వేస్టేషన్లను ఎంపిక చేసి వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో ప్రతి రోజు 250 రైళ్ల రాకపోకలతో రూ.70 లక్షల ఆదాయం వచ్చే విజయవాడ రైల్వేస్టేషన్‌ను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు సిద్ధం చేస్తున్నారు. విజయవాడతోపాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. వీటికి సంబంధించి ఈనెల 8న ప్రీ–టెండర్ బిడ్‌ను సికింద్రాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ప్రైవేటు సంస్థకు అప్పగింత...
రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయడానికి స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఒక డెవలపర్‌ను ఎంపిక చేస్తారు. రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాం, సర్క్యులేటింగ్ ఏరియాతోపాటు, స్టేషన్ దగ్గరలోని తారాపేట వైపు ఉన్న కార్ పార్కింగ్ ఏరియా, తూర్పు ద్వారం వైపు ఉన్న పార్కింగ్ ప్రదేశాలు, సత్యనారాయణపురంలో ఉన్న రైల్వేస్థలాలను ఆ డెవలపర్‌కు అప్పగిస్తారు. ఈ స్థలాల్లో మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, హోటళ్లు నిర్మిస్తారు. ఇందులో భాగంగానే అంతర్జాతీయ రైల్వేస్టేషన్‌లో ఉండే అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులకు కావాల్సిన అత్యాధునిక సౌకర్యాలన్నింటిని అక్కడ ఏర్పాటు చేస్తారు. మిగిలిన స్థలాల్లో డెవలపర్స్‌భవనాలు నిర్మించుకుని అద్దెలకు ఇచ్చుకుంటారు. రైల్వే భూములు ఆ శాఖ ఆధీనంలో ఉన్నప్పటికీ డెవలపర్ పెట్టుబడితో పాటు లాభాలు సంపాదించుకునేందుకు 45 ఏళ్లు పాటు స్టేషన్, రైల్వేస్థలాల్లో నిర్మించిన భవనాలు వారి ఆధీనంలోనే ఉంచుతారు.
డెవలపర్ ఎంపిక..
స్టేషన్ అభివృద్ధికి డెవలపర్స్‌ను ఎంపిక చేసేందుకు టెండర్లు పిలిచి వారి చేత టెక్నికల్, ఫైనాన్షియల్ ప్రాజెక్టు రిపోర్టులను తెప్పిస్తారు. ఈ విధంగా వచ్చిన ప్రాజెక్టు రిపోర్టులను రైల్వే మంత్రిత్వ శాఖ పరిశీలించిన తరువాత డెవలపర్‌ను ఎంపిక చేస్తారని చెబుతున్నారు.
కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ ....
కార్పొరేట్ సంస్థలకు నగరాల్లో విలువైన భూములు లభించడం లేదు. ఈ నేపథ్యంలో రైల్వే భూములపై కన్నేసినట్లు తెలిసింది. కార్పొరేట్‌కు 45 ఏళ్ల పాటు స్థలాలు అప్పగిస్తే... ఆ తరువాత కార్పొరేట్ సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే మరికొంతకాలం స్టేషన్లు, విలువైన రైల్వే భూములు వారి చేతిలోనే ఉంటాయి. ఇది ఒక రకంగా రైల్వే శాఖకు చెందిన విలువైన భూముల్ని కార్పొరేట్లకు అప్పగించడమేనని రైల్వే కార్మిక Sసంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రయాణికులకు అత్యాధునిక షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లు అవసరమా అని రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజనల్ కార్యదర్శి శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు. కేవలం ప్రైవేటు సంస్థలకు రైల్వే ఆస్తుల్ని కట్టబెట్టడంలో భాగంగానే స్విస్‌చాలెంజ్ పద్ధతిని తెరపైకి తెస్తున్నారని ఆయన ఆరోపించారు.