రైల్వేను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
దక్షిణమధ్య రైల్వే ఉద్యోగుల సంఘం మండిపాటు
హైదరాబాద్: రైల్వే శాఖను ఉద్దేశపూర్వకంగా నష్టాల బాటలో నడుపుతున్న కేంద్ర ప్రభుత్వం తీరుపై ఉద్యమిస్తామని దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం హెచ్చరించింది. సంఘం జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం నగరంలో పారంభమైన సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య మీడియాతో మాట్లాడారు. రైల్వేల ప్రగతికి ప్రభుత్వమే అడ్డంకిగా నిలుస్తోందని విమర్శించారు. సరుకు రవాణా వ్యాగన్ల సంఖ్యను, చార్జీలను పెంచకపోవడం వల్ల ఆదాయం పెరగడం లేదన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతులను పాటించి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఉన్నతాధికారులపై మండిపడ్డారు. తగినంత మంది సిబ్బంది లేక ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతోందని, దీంతో ఆశించిన ఫలితాలు రావడం లేదని చెప్పారు.
పదవీ విరమణ చేసే ఉద్యోగుల విషయంలోనూ కొత్త పెన్షన్ విధానాన్ని అమలులోకి తేవడం అన్యాయమన్నారు. పాత విధానాన్నే పాటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త జోన్ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదన్నారు. మూడు రోజులపాటు జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రైల్వే ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, రైల్వే వ్యవస్థ పటిష్టానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు. దాని అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.