ఏజెన్సీలో వర్ష బీభత్సం
-
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు
-
నీటమునిగిన పంటలు
-
పలుచోట్ల రోడ్లు, చెరువులకు గండ్లు
కొత్తగూడ : కొత్తగూడ ఏజెన్సీలో వర్షం బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. సమీపంలో ఉన్న వందలాది ఎకరాల్లో పత్తి, మక్కజొన్న, మిర్చి, వరి పంటలు దెబ్బతిన్నాయి. వాగుల వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న కరెంట్ మోటార్లు నీటమునిగి కాలిపోయాయి. కొన్ని మోటార్లు వాగులో కొట్టుకుపోయాయి. చెరువుముందుతండా, వేలుబెల్లి, కొత్తపల్లి, రౌతుగూడెం, లక్ష్మీపురం, దుర్గారం, ఎదుళ్లపల్లి గ్రామాల్లో వాగులను ఆనుకుని ఉన్న పంట పొలాలు వరద ఉధృతికి దెబ్బతిన్నాయి. చెరువుముందుతండా సమీపంలోని లొద్దికుంట మత్తడి గోడ పక్కన గండిపడి నీరంతా వృథాగా పోతోంది. వేలుబెల్లి గ్రామ సమీపంలోని వాగు పొంగి ప్రవహించడంలో మధ్యాహ్నం వరకు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా పలు చెరువులు జల కళ సంతరించుకుని మత్తడి పోస్తున్నాయి. 90.2ఎంఎం వర్షపాతం నమోదు అయినట్లు తహసీల్దార్ ఉప్పలయ్య తెలిపారు. రాక పోకల సమయంలో వాగుల వద్ద తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
21ఎంయూఎల్701:కొత్తపల్లి-కొత్తగూడ మధ్య రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద