వర్ష బీభత్సం
వర్ష బీభత్సం
Published Tue, Sep 13 2016 11:26 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM
* జనజీవనం అతలాకుతలం
* గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో కుంభవృష్టి
* కరాలపాడులో మట్టిమిద్దె కూలి వృద్ధురాలి మృతి
* పొంగిపొర్లుతున్న చెరువులు, వాగులు, కుంటలు
* గురజాలలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
* లోతట్టు ప్రాంతాలు జలమయం
* పల్నాడులో పంట నష్టంపై వైఎస్ జగన్ ఆరా
సాక్షి, గుంటూరు : జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో జన జీవనం స్తంభించింది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతమైన గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో కుంభవృష్టి కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏడు దశాబ్దాల కాలంలో ఈ స్థాయిలో వరదలు రావడం ఇదే మొదటిసారని ఆయా ప్రాంతాల్లోని వృద్ధులు చెబుతున్నారు. గురజాల మండలంలో దండెవాగు, ఎర్ర, నల్ల వాగులు, రెంటచింతల వద్ద గాడిదల వాగు, గోళి వాగు, ఏడు మంగళం వాగు, గడ్డివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గుంటూరు – మాచర్ల, గురజాల – కారంపూడి, గురజాల – దైద మధ్య రాకపోకలు స్తంభించాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగింది.
గురజాల రైల్వేస్టేషన్ సమీపంలో దండెవాగు ఉధృతికి రైల్వేట్రాక్ వంద మీటర్ల మేర కొట్టుకుపోయింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు – మాచర్ల ప్యాసింజర్ రైలును నడికుడి వద్ద నిలిపివేశారు. మంగళవారం సాయంత్రం రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు ప్రారంభించారు. ఈ పనులను గుంటూరు డీఆర్‌ఎం విజయ్‌శర్మ పరిశీలించారు.
కొట్టుకుపోయిన దుకాణాలు...
జంగమహేశ్వరపురం గ్రామంలో వరవకట్ట తెగడంతో ఎస్‌టీ కాలనీ, జెడ్పీ హైస్కూల్‌లోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురజాల పట్టణంలోని నందనం వెంకటరావు నగర్ పూర్తిగా జలమయం కావడంతో గురజాల ఆర్డీఓ మురళి, డీఎస్పీ నాగేశ్వరరావు కాలనీ వాసులను సురక్షిత ప్రాంతానికి తరలించి వారికి వసతి, భోజన సదుపాయం కల్పించారు. బస్‌స్టేషన్ సమీపంలో వరద ఉధృతికి ఎనిమిది షాపులు కొట్టుకుపోయాయి. దీంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. పిడుగురాళ్ల మండలం కరాలపాడులో వర్షానికి మట్టిమిద్దె కూలి పందెళ్ల కృష్ణవేణమ్మ (63) అనే వృద్ధురాలు మృతి చెందింది. కారంపూడి, రెంటచింతల మండలాల్లో సైతం చెరువులకు గండ్లుపడి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలంలో తంగిరాల చెరువుకు గండిపడి నాగిరెడ్డిపల్లి – తంగిరాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
రైతుల ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు
నిన్నమొన్నటి వరకు వర్షాలు లేక అల్లాడిపోయిన పల్నాడు రైతులు వేలకువేలు ఖర్చు చేసి మోటార్ల ద్వారా తడులు వేశారు. పల్నాడులో అధికంగా ప్రత్తి, మిర్చి పంటలు సాగు చేశారు. తడులు వేసిన తరువాత పది రోజుల క్రితం భారీ వర్షాలు కురవడంతో పంటలు ఉరకెత్తి దెబ్బతిన్నాయి. ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటున్నాయనుకుంటున్న తరుణంలో సోమవారం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు అతి భారీ వర్షాలు కురవడంతో గురజాల, రెంటచింతల, కారంపూడి, దుర్గి, దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల్లో వేలాది ఎకరాల పంట పూర్తిగా మునిగిపోయింది. ప్రత్తి పంట కాయలు కాసి చేతికి వస్తున్న దశలో వర్షాలు కురవడంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒక్క క్వింటా పత్తి కూడా చేతికిరాని పరిస్థితి. దీంతో రెండేళ్లుగా పంటలు లేక తీవ్ర నష్టాల పాలైన రైతులు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది.
పల్నాడులో పంట నష్టంపై జగన్ ఆరా...
పల్నాడు ప్రాంతమైన గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా పంట నష్టం జరగడంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఆరా తీశారు. గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలకు ఫోన్ చేసి రైతుల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో రైతులకు అండగా నిలవాలని వారికి సూచించారు. వైఎస్సార్‌సీపీ రైతులకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
Advertisement
Advertisement