
పలు ప్రాంతాల్లో గాలివాన
అనంతపురం అగ్రికల్చర్ : సోమవారం సాయంత్రం వరకు అధిక ఉష్ణోగ్రతలతో నిప్పుల కుంపటిగా మారిన ‘అనంత’లో సాయంత్రం వేళ కాస్త వాతావరణం మారింది. ఉరుములు, మెరుపులతో పాటు గాలి వీయడంతో కాస్త చల్లదనం సంతరించుకుంది. తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న జనం గాలుల వల్ల కాస్త ఉపశమనం పొందారు. శింగనమల, పుట్లూరులో 15 మి.మీ, నల్లమాడ, కనగానపల్లి, తలుపుల, తాడిపత్రి 10 మి.మీ, బుక్కపట్నం, కదిరి 8 మి.మీ మేర వర్షం పడింది. ఓడీ చెరువు, ముదిగుబ్బ, పుట్టపర్తి, రామగిరి, చెన్నేకొత్తపల్లి, గుడిబండ, యాడికి, గార్లదిన్నె, పామిడి, అనంతపురం, బుక్కరాయసముద్రం తదితర మండలాల పరిధిలో చిరుజల్లులు పడ్డాయి. వర్షపాతం నమోదైనా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఈనెలతో పాటు మే నెలలో కూడా రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నేలకొరిగిన అరటి తోటలు
యల్లనూరు : యల్లనూరు మండలంలోని తిమ్మంపల్లి, కొండవండ్లపల్లి, బుక్కాపురం గ్రామాల్లో సోమవారం రాత్రి కురిసిన గాలివానకు 30 ఎకరాల వరకు అరటి తోటలు నేలకొరిగాయి. తిమ్మంపల్లిలోని తోటల్లోని విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయినట్లు ఆ గ్రామస్తులు తెలిపారు. అకాల వర్షంతో అరటి తోటలు దెబ్బతినడంతో బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.