ఆత్మ పరిశీలన చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు
ఆత్మ పరిశీలన చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు
Published Mon, Aug 8 2016 7:22 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
– రజక జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు
కర్నూలు(అర్బన్):
రజకులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఏపీ రజక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాతపాటి అంజిబాబు హెచ్చరించారు. సోమవారం ఉదయం స్థానిక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రకులాలకు కార్పొరేషన్లు, బీసీ కులాలకు ఫెడరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బీసీ కులాలపై చిన్న చూపు చూస్తోందన్నారు. అగ్రకులాలకు చెందిన కార్పొరేషన్లకు వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్న ప్రభుత్వం బీసీ కులాల ఫెడరేషన్లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లతో సరిపెడుతోందన్నారు. కాపుల సంక్షేమం పట్ల పూర్తి స్థాయిలో స్పందిస్తున్న ప్రభుత్వానికి రజకుల సంక్షేమం పట్టడం లేదన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై ఆలస్యం జరిగితే.. కనీసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. విదేశీ విద్యను అభ్యసించే అవకాశాన్ని కూడా కల్పించాలన్నారు.
నవంబర్ 27న రజక ఆత్మ గౌరవ సభ
రాష్ట్ర వ్యాప్తంగా రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకుపోయేందుకు నవంబర్ 27న విజయవాడలో ఐదు లక్షల మంది రజకులతో ఆత్మగౌరవ సభను నిర్వహిస్తున్నట్లు అంజిబాబు తెలిపారు. సభకు ముఖ్యమంత్రితో పాటు అందరు ప్రజా ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామన్నారు. హాజరు కాని నాయకులకు భవిష్యత్తులో రజకులు ఓట్లు వేయబోరన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రజకులకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలని, తమను గుర్తించిన పార్టీలకే మద్దతు ఇస్తామన్నారు.
10న రజక జేఏసీ నూతన కార్యవర్గం ఎన్నిక
ఈ నెల 10న స్థానిక బీసీ భవన్‌లో ఉదయం 10 గంటలకు రజక సంఘాల ఐక్యవేదిక జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయనున్నట్లు జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రాంబాబు తెలిపారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి రజకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఆదోనిలో ధోబీఘాట్లకు కేటాయించిన స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో జేఏసీ ఉపాధ్యక్షుడు సీపీ వెంకటేష్, వాడాల నాగరాజు, అఖిల భారత ధోబీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లెల్ల శ్రీరాములు, జిల్లా నాయకులు చంద్రశేఖర్, వి.శ్రీనివాసులు, గణేష్, రాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Advertisement