కఠోర శ్రమతోనే విజయం సాధ్యం
కఠోర శ్రమతోనే విజయం సాధ్యం
Published Sat, Jul 22 2017 11:24 PM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM
ఒలింపిక్ మెడల్ విజేత సింధు
వైభవంగా షీ టీమ్ ప్రథమ వార్షికోత్సవం
తాడితోట/(రాజమహేంద్రవరం సిటీ) : కఠోర శ్రమతోనే విజయం సాధ్యమని ప్రముఖ క్రీడాకారిణి, ఒలింపిక్ మెడల్ విజేత పీవీ సింధు అన్నారు. స్థానిక ఆనం కళాకేంద్రంలో నిర్వహించిన శనివారం రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోని షీ టీమ్ ప్రథమ వార్షికోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షీ టీమ్ సభ్యులు వాట్సప్, మెయిల్స్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై క్షణాలలో రక్షణ కల్పించడం అభినందనీయమని కితాబు ఇచ్చారు. షీ టీమ్ వల్ల మహిళలకు భద్రత, రక్షణ కలుగుతుందని, ఈ టీమ్‌లను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని సూచించారు.
యువత స్ఫూర్తిగా తీసుకోవాలి..
రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి మాట్లాడుతూ పీవీ సింధును స్ఫూర్తిగా తీసుకొని యువత విజయం సాధించాలని యువతకు సూచించారు. స్త్రీలు ఎక్కడ గౌరవించిన చోటే దేవతలు ఉంటారన్న ఆరోక్తిని ప్రస్తావించారు. మహిళలపై దాడులు, వేధింపులను అరికట్టాలనే లక్ష్యంతో షీ టీమ్ ఏర్పాటు చేశామని, ఈ ఏడాదిలో సుమారు మూడు వేలకు పైగా యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. షీ టీమ్ ఏర్పాటుతో నగరంలోని మహిళలకు భరోసా ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా షీ టీమ్ తరఫున యాప్‌ను ప్రారంభించారు.
పిల్లలపై బాధ్యతగా వ్యవహరించాలి...
సింధు తండ్రి రమణ మాట్లాడుతూ కుటుంబ సభ్యులు తమ పిల్లల్ని ఏం చేస్తున్నారో ఒక కన్ను వేసి ఉంచాలని సూచించారు. తాము బాధ్యతగా వ్యవహరించడం వల్లే సింధు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగిందని అన్నారు. తొలుత సింధును మధురపూడి విమానాశ్రయం నుంచి ఊరేగింపుగా ఆనం కళాకేంద్రానికి తీసుకువచ్చారు. షీ టీమ్ అధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన పోటీలు, షటిల్ బ్యాడ్మింటెన్ పోటీలలో విజేతలకు సింధూ బహుమతులు అందజేశారు.
సింధుకు ఘన సత్కారం
ఈ సందర్భంగా సింధూను ఘనంగా సత్కరించారు. షీ టీమ్ సభ్యులను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సిరి ఆనంద్, ప్రభుత్వ హాస్పిటల్ ఆర్‌ఎంఓ పద్మశ్రీ,, సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సతీమణి ఆకుల పద్మ, భవాని చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు ఆదిరెడ్డి భవాని, బి.సత్యకుమారి, ఆర్.చంద్రకళ, అడిషినల్ ఎస్పీలు ఆర్.గంగాధరరావు, రజనీకాంత్‌రెడ్డి, డీఎస్పీలు కులశేఖర్, రామకృష్ణ, రమేష్ బాబు, శ్రీనివాసరావు, వైవీ రమణరావు, సీఐలు రవీంద్ర, మారుతీ రావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement