రామయ్యకు కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి సోమవారం ఘనంగా ముత్తంగి సేవ నిర్వహించారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన చేశారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకుని వచ్చి భద్రుడిగుడిలో అభిషేకం నిర్వహించారు. అనంతరం అంతరాలయంలో మూలవరులకు ఘనంగా ముత్తంగి సేవ చేశారు. రామయ్యకు, సీతమ్మకు, లక్ష్మణ స్వామికి, ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీతాయారమ్మ వారికి, అంజనేయ స్వామి వారికి ముత్యాలతో తయారు చేసిన వస్త్రాలతో ఘనంగా ముత్తంగి సేవ నిర్వహించారు. అనంతరం స్వామి వారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ ప్రాకార మండపంలో వేంచేయింపజేసి ముందుగా విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవతేధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. అర్చకులు స్వామి వారి, అమ్మవార్ల వంశ క్రమాన్ని భక్తులకు వివరించారు. ఆలయ విశిష్టత గురించి భక్తులకు తెలియజేశారు. వేద పండితులు వేద విన్నపాలు చేశారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం వైభవంగా అర్చకులు స్వామి వారికి నిత్యకల్యాణం నిర్వహించారు. అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
- ఉత్సవ మూర్తులకు అభిషేకం
గోదావరి అంత్య పుష్కరాలు పురస్కరించుకుని ఆలయ బేడా మండపంలో స్వామి వారి ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు. పవిత్ర గోదావరి నదీ జలాలు, నారికేళ జలాలు, సుగంధ ద్రవ్యాలు, హరిద్రాచూర్ణాలు, పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.