
సెలైంట్‌గా నొక్కేస్తున్నారు!
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సొంత జిల్లాలోనే ప్రజాపంపిణీ వ్యవస్థ గాడి తప్పింది.
►గాడితప్పిన ప్రజాపంపిణీ వ్యవస్థ
► రేషన్ దుకాణాల్లో యథేచ్ఛగా అక్రమాలు
► పక్కదారి పడుతున్న కిరోసిన్
► అధికారుల తనిఖీలు శూన్యం
► జిల్లాలో రేషన్ దుకాణాలు 2,983
► రేషన్‌కార్డులు 12,38,255
► లబ్ధిదారులు 46,73,119
ధర్మవరం : రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సొంత జిల్లాలోనే ప్రజాపంపిణీ వ్యవస్థ గాడి తప్పింది. ఈ-పాస్ యంత్రాలకు తంత్రాలు వేస్తూ డీలర్లు యథేచ్ఛగా సరుకులు దోచేస్తున్నారు. కిరోసిన్ పంపిణీ మానేశారు. ఒక్కో కార్డుపై అర కిలో వరకూ బియ్యం లాగేసుకుంటున్నారు. చక్కెర కిలోకు వంద గ్రాములు కోతేస్తున్నారు. అయినా డీలర్లపై చర్యలు లేవు.
జిల్లాలో మొత్తం 2,983 చౌకదుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 12,38,255 కార్డులు ఉన్నాయి. ఈ-పాస్‌లో వేలి ముద్రలు పడని వారికి ఐరిష్ ద్వారా సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలోని అన్ని చౌక డిపోలకు ఐరిష్ యంత్రాలు అందజేశారు. గత నెలలో పదివేల మందికి పైగా కార్డుదారులకు వేలిముద్రలు పడలేదని గుర్తించారు. అయినా ఐరిష్ యంత్రాలను పదుల సంఖ్యలో కూడా వాడలేదు.
అంత్యోదయకు అరకొరే.. అంత్యోదయ అన్నయోజన కార్డులు డబ్ల్యూఏపీ (వైట్ ఆంధ్రప్రదేశ్) కార్డులుగా మారిపోయాయి. జిల్లాలో 1.10 లక్షల అంత్యోదయ కార్డులు ఉండగా.. 20 శాతానికి పైగా ఇదే పరిస్థితి. కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా కార్డుకు 35 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే.. రెండు,మూడు నెలలుగా సభ్యుల సంఖ్యను బట్టి ఐదు కిలోల చొప్పున ఇస్తున్నారు. ఈ కార్డులు ఎందుకు మారాయో పౌరసరఫరాల శాఖ అధికారులకే తెలియదట.
కిరోసిన్ దోపిడీ : జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్డులలో 11,47,435 కార్డులకు సంబంధించి గ్యాస్ కనెక్షన్లు లేవు. ఒక్క ధర్మవరం మునిసిపాలిటీ పరిధిలో 6,595 కార్డులకు గ్యాస్ కనెక్షన్లు లేవు. వీరికి కార్డుకు నాలుగు లీటర్ల చొప్పున కిరోసిన్ వేయాల్సి ఉండగా.. ఒక లీటర్ మాత్రమే వేస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ ఉండటం వల్ల ఒక లీటర్ మాత్రమే వచ్చిందని అంటున్నారు. మరికొందరు అసలు వేయకుండానే కిరోసిన్‌ను పక్కదారి పట్టిస్తున్నా రు. జిల్లాలో ప్రతినెలా రెండు లక్షల లీటర్ల మేర కిరోసిన్‌ను డీలర్లు బయట అధిక ధరలకు అమ్ముకున్నట్లు అధికారులు చెప్తున్నారు.
రసీదు ఇస్తే ఒట్టు చౌక దుకాణానికి వెళ్లిన కార్డుదారుడు ఈ-పాస్ యంత్రంపై వేలిముద్ర వేయగానే రేషన్ సరుకుల వివరాలు తెలుస్తాయి. అయితే..ఈ వివరాలు కార్డుదారునికి వినిపించకుండా డీలర్లు వ్యాల్యూమ్ (శబ్దం) తగ్గించేస్తున్నారు. యంత్రం నుంచి వచ్చే రసీదును కూడా కార్డుదారుడికి ఇవ్వడంలేదు. ఒకవేళ ఇస్తే అందులో అన్ని వివరాలు తెలుస్తాయి. జిల్లా వ్యాప్తంగా 90 శాతం మంది డీలర్లు ఇలాగే మోసం చేస్తున్నారు. ఇంతా జరుగుతున్నా ఏ ఒక్క రెవెన్యూ అధికారీ తనిఖీ చేసిన దాఖలాలు లేవు. జిల్లా వ్యాప్తంగా చౌక దుకాణాలన్నీ అధికార పార్టీ మద్దతుదారులే నిర్వహిస్తున్నారు. దీంతో తనిఖీలు చేయడానికి అధికారులు వెనుకంజ వేస్తున్నారు. తమ జోలికి ఎవరూ రారులే అని ధైర్యంతో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
20 కిలోలు మాత్రమే ఇస్తున్నారు : అంత్యోదయ కార్డుకు బియ్యం అరకొరగానే ఇస్తున్నారు. గతంలో ప్రతినెలా 35 కిలోల బియ్యం ఇచ్చేవారు. ప్రస్తుతం ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున నలుగురికి 20 కిలోలు ఇస్తున్నారు. ఇదేమిటని అడిగితే సమాధానం చెప్పడంలేదు. - చిన్ననాగమ్మ, ముదిగుబ్బ
చర్యలు తీసుకుంటాం
ప్రజా పంపిణీలో సమస్యలు మా దృష్టికి రాలేదు. ఏవైనా సమస్యలుంటే, అవకతవకలు జరిగి ఉంటే లబ్ధిదారులు నేరుగ తెలియజేయొచ్చు. డీలర్లు అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనాఉపేక్షించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. త్వరలోనే రేషన్‌షాపులను తనిఖీ చేస్తాం. - బాలానాయక్, ఆర్డీవో, ధర్మవరం