స్వాధీనం చేసుకుంటారా? సర్దుకుపోతారా?
Published Sun, Jul 24 2016 1:03 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
సాక్షి ప్రతినిధి– నెల్లూరు: నెల్లూరు పట్టణంలోని ట్రంకు రోడ్డులో రూ.100 కోట్లకు పైగా విలువయ్యే రంగనాథస్వామికి చెందిన వాణిజ్య భవన సముదాయాలను దేవాదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటారా? లేక అధికార పార్టీ ముఖ్య నాయకులకు సరెండర్ అవుతారా? ప్రజలు, రాజకీయ వర్గా ల్లో ఈ చర్చ ప్రారంభమైంది. దేవాలయాల భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు ఏవీ చెల్లవని సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసైనా ఈ భూ మిని రక్షించుకునే దిశగా అడుగులు వేస్తారా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహా రంపై శనివారం సాక్షిలో ప్రచురితమైన ‘‘ రంగడి భూమి గోవిందా’’ కథనంపై దేవాదాయశాఖ కమిషనర్ స్థానిక అధికారులను నివేదిక కోరారు.
నెల్లూరుకు చెందిన ఐతా చెంచు రామయ్య ముత్యాల శెట్టి 1894 సెప్టెంబరు 28వ తేదీ తనకు చెందిన 1.08 ఎకరాల భూమి శ్రీ రంగనాథస్వామి రథోత్సవ నిర్వహణ, ప్రసాదాల పంపిణీ కోసం దేవస్థానానికి దానం చేసిన విషయం తెలిసిందే. 1917వ సంవత్సరం సెప్టెంబరు 25వ తేదీ అప్పటి ధర్మకర్తల మండలి ఈ భూమిని ఎ. వెంకయ్యకు 99 సంవత్సరాల లీజుకు ఇచ్చారు. వెంకయ్య తన లీజును నెల్లూరుకే చెందిన ఎన్.చలపతిరావుకు బదిలీ చేశారు. ఆ తర్వాత ఈ భూమి చాలా మంది చేతులు మారి ప్రస్తుతం వ్యాపార సముదాయాల్లో 42 మంది అనధికారిక లీజుదారులు ఉన్నారు. భూ మి దేవస్థానానిదేననీ దీన్ని దేవాదాయశాఖ స్వాధీ నం చేసుకోవచ్చని హై కోర్టు 30–7–1997లో తీర్పు చెప్పింది. అప్పటి టీడీపీ ముఖ్య నేతలు దేవాదాయశాఖ అధికారులపై ఒత్తిడి తేవడంతో వారు హై కోర్టు ఉత్తర్వులు అమలు చేయకుండా నిలిపేశారు. దీంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే సమయం రావడానికి మరో 19 ఏళ్లు పట్టింది. టీడీపీ ముఖ్య నేతల ఒత్తిళ్లు తీవ్రంగా ఉండటంతో ఇప్పుడు కూడా ఈ భవనాలను స్వాధీనం చేసుకునేందు కు తటపటాయిస్తున్నారు. వెంకయ్యకు ఇచ్చిన 99 సంవత్సరాల లీజు ఈ ఏడాది సెప్టెంబరు 25వ తేదీతో ముగియనుంది.
సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయొచ్చు
దేవాలయాలకు చెందిన భూములు ఎవరు అమ్మినా, కొన్నా, ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగినా చెల్లుబాటు కాదనీ, ఆ భూములు ఆలయాలకే చెందుతాయని తిరుమల–తిరుపతి దేవస్థానంకు తిరుపతిలోని మహవీర్ థియేటర్ యాజమాన్యానికి జరిగిన వాజ్యంలో సుప్రీం కోర్టు స్పష్టంగా తీర్పు నిచ్చింది. ఈ తీర్పు ఆధారంగానే తిరుపతి తిలక్ రోడ్డులోని మహవీర్ థియేటర్ స్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుని నిర్మాణాలను కూల్చివేసింది. ప్రస్తుతం ఈ భూమిలోనే శ్రీదేవి కాంప్లెక్స్ నిర్మిం చింది. ఈ తీర్పు ఆధారంగానైనా రంగనాథ స్వామి ఆలయ అధికారులు ట్రంకు రోడ్డులోని ఆలయ భూమిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.
Advertisement