- 15 రోజుల క్రితం పైడిపల్లిలో ఘటన
- కుళ్లిపోయిన మృతదేహం
- పోలీసులకు సమాచారం ఇచ్చిన సోదరి
- హతుడు తొమ్మిది కేసుల్లో నిందితుడు
పైడిపెల్లిలో రౌడీషీటర్ హత్య
Published Mon, Aug 1 2016 11:56 PM | Last Updated on Sat, Aug 25 2018 4:52 PM
వెల్గటూరు : ‘కత్తిపట్టినోడు కత్తితోనే పోతాడు.. గన్ను పట్టినోడు గన్నుతోనే హతమవుతాడు’ అన్నట్లు రెండు దశాబ్దాలుగా నేర చరిత్ర ఉన్న ఓ రౌడీషీటర్ చివరకు గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యడు. 15 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పెద్దపెల్లి సీఐ మహేశ్ కథనం ప్రకారం.. వెల్గటూర్ మండలం పైడిపెల్లి గ్రామానికి చెందిన ఎనగందుల తిరుపతి ఓ రౌడీషీటర్. గ్రామంలో ఒంటరిగానే జీవిస్తున్నాడు. ఇటీవల ఏకాదశి పండుగకు ధర్మపురి మండలం భీర్‌పూర్ గ్రామంలో ఉంటున్న తన అక్క వద్దకు వెళ్లాడు. అక్కడే ఒకరోజు ఉండి తర్వాత ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి ఎవ్వరికీ కనిపించడంలేదు. ఇతడి చెల్లెలు లీలావతి రాజారాంపల్లి గ్రామంలో ఉంటోంది. ఆమె కొద్ది రోజులుగా తిరుపతికి ఫోన్ చేస్తుండగా స్విచ్‌ఆఫ్ వస్తోంది.ఈక్రమంలో అనుమానం వచ్చిన లీలావతి సోమవారం పైడిపెల్లిలోని తిరుపతి ఇంటికి వచ్చింది. ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. పరిసరాలన్నీ దుర్వాసన వస్తున్నాయి. అనుమానం వచ్చి వెల్గటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై అంజయ్య సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తుల సమక్షంలో ఇంటి తలుపులు తెరిపించాడు. లోనికి వెళ్లి చూడగా తిరుపతి శవమై కనిపించాడు. శవం పూర్తిగా కుళ్లి పోయింది. ఎముకలు చర్మం మాత్రమే ఉంది. ముందు రూములో రక్తపు మరకలు ఉన్నాయి. శరీరంపై అండర్‌వేర్ మాత్రమే ఉంది. లుంగీ మరోచోట పడిఉంది. ఇంట్లో పెనుగులాట జరిగినట్లు ఆనవాళ్లు ఉండడంతో గుర్తుతెలియని వ్యక్తులు తిరుపతిని హత్యచేసి ఉంటారని భావిస్తున్నట్లు సీఐ తెలిపారు. తిరుపతిపై తొమ్మిది కేసులు ఉన్నాయి. వీటిలో ఒకటి వరకట్నం కోసం భార్యను హత్య చేయగా, మరోటి జంట హత్య కేసు. పలు దాడి కేసుల్లోనూ తిరుపతి నిందితుడు. దీంతో 2007లో వెల్గటూరు పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. తిరుపతి జీవితం ఆ ద్యంతం వివాదాస్పదంగా ఉండగా, చివరికి అతడి మర్డర్ కూడా మిస్టరీగానే జరిగింది. తిరుపతి మృతుడి రెండో భార్య వనిత ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేశ్, ఎస్సై అంజయ్య తెలిపారు.
Advertisement
Advertisement