ఉల్లి రైతు కంట కన్నీరు
దిగుబడి గణనీయం.. ధర భారీ పతనం
నాడు క్వింటా.. 4వేలు.. నేడు రూ.400
రైతులను పట్టించుకోని ప్రభుత్వం
గుమ్మఘట్ట : జిల్లా వ్యాప్తంగా ఉల్లి రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గతేడాది సిరులు కురిపించిన ఈ పంట, ప్రస్తుతం కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆశించిన స్థాయిలో దిగుబడులు చేతికందినా, ధరలే కొంప ముంచాయంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా గుమ్మఘట్ట మండలంలో 2,200, రాయదుర్గం రూరల్‌లో 400, కణేకల్లులో 200, బొమ్మనహాళ్‌లో 60, డీ హిరేహాళ్ లో 100 ఎకరాల్లో ఉల్లి పంటలు సాగయ్యాయి. జిల్లాలోనే అత్యధికంగా గుమ్మఘట్ట మండలంలో ఉల్లి సాగు ఏటేటా పెరుగుతూనే ఉంది.
ధర తారుమారు
గత ఏడాది ఈ సమయానికి క్వింటాలు ఉల్లి రూ.3,500 నుంచి రూ.4 వేల వరకు ధర పలికింది. అప్పుడు పంట సాగు చేసిన రైతులు మంచి లాభాలు చూశారు. ప్రస్తుతం ఇందులో సగం ధరలు కూడా లేకపోవడంతో కుదేలైపోయారు. క్వింటాలు ఉల్లి రూ. 300 నుంచి రూ. 400లోపే ధర పలుకుతోంది.
దళారుల ఇష్టారాజ్యం..
రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో ఉల్లి పంట ఆనవాయితీగా సాగవుతున్నా.. సరైన మార్కెటింగ్ సౌకర్యం లేక రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. ఉల్లిని విక్రయించాలంటే రాజమండ్రి, కర్నూలు, చిత్తూరు, బెంగళూరు లాంటి పట్టణ ప్రాంతాలకు తరలించాల్సి వస్తోంది. దీన్నే అదనుగా తీసుకున్న దళారులు కొందరు ధర నిర్ణేతలుగా మారిపోతున్నారు. ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తూ రైతు నోట్లో మట్టికొడుతున్నారు.
కేంద్రం స్పందించాలి
గతేడాదితో పోలిస్తే ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. క్వింటాలు ఉల్లి రూ. 300 నుంచి రూ.400 లోపు పలికితే ఎలా గట్టెక్కాలో రైతుకు అర్థం కావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉల్లి ఎగుమతికి అనుమతించి, మద్దతు ధరలు పెంచేలా చూడాలి. లేదంటే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి.
– ఉపేంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర నాయకుడు
రైతులను ఆదుకోవడంలో సర్కార్ విఫలం
ఉల్లి, టమాట, వేరుశనగ లాంటి ప్రధాన పంటలను కోల్పోయి రైతులు కకావికలమయ్యారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలే చేపట్టలేక పోయింది. రూ. లక్షల పెట్టుబడులు మట్టిలో కలిసిపోయాయి. రాయదుర్గంలో మార్కెటింగ్ సౌకర్యంతో పాటు రైతు పండించిన ప్రతి పంటకూ గిట్టుబాటు ధరలు కల్పించాలి. వేరుశనగ, ఉల్లి, టమాట రైతులను తక్షణం ఆర్థికంగా ఆదుకోవాలి.
– కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం