కాంటాలతో.. కనికట్టు
-
తక్కెడలను ఉపయోగిస్తున్న డీలర్లు
-
నష్టపోతున్న లబ్ధిదారులు
-
చోద్యం చూస్తున్న అధికారులు
తలమడుగు (తాంసి) : వార్తల్లో మనం తరుచూ చూస్తుంటాం... పట్టుబడ్డ రేషన్ బియ్యం, అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత... ఇవి చాలు లబ్ధిదారులకు చేరవల్సిన చౌకధరల దుకాణంలోని వస్తువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయి అనడానికి నిదర్శనం. చౌక ధరల దుకాణంలో డీలర్ కొలిచి ఇచ్చినప్పుడు బరువులో వ్యత్యాసం ఉండదు. కానీ ఇంటి దగ్గరకు వచ్చి కొలిచి చూస్తే తేడా కొడుతుంది. కనికట్టు అంతా తక్కెడలోనే....
చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యవసర సరుకుల పంపిణీలో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు, తునికల్లో మోసాలను నివారించేందుకు ఎలక్ట్రానిక్ మిషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలున్నా ఎక్కడా అవి అమలు కావడం లేదు. తాంసి మండలంలో మొత్తం 23 గ్రామ పంచాయతీలో 23 చౌకధర దుకాణాలున్నాయి. తలమడుగు మండలంలో 16గ్రామ పంచాయతీలలో 16 రేషన్ దుకాణాలు ఉన్నాయి. రెండు, మూడు గ్రామాల్లో తప్ప మిగతా ఎక్కడ కూడా ఎలక్ట్రానిక్ కాంటాలను ఉపయోగించడం లేదు. పాత తక్కెడలను ఉపయోగిస్తున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో పంపిణీ చేసిన బియ్యం, చక్కెర, వంటి సరుకుల బరువులో వ్యత్యాసాలుంటున్నాయి. సరుకుల పంపిణీలో పాత కాంటాలనే వినియోగిస్తున్నారు.
దీంతో డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నార నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అధికారులు అక్రమాల నివారణ కోసం ప్రతి షాపులో ఎలక్ట్రానిక్ కాంటాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కానీ ఎక్కడా వాటి వినియోగించిన దాఖలాలు లేవు. ఎలక్ట్రానిక్ కాంటాల వల్ల అక్రమాలకు పాల్పడే అవకాశం లేకపోవడంతో వాటిని పక్కన పెట్టి పాత తక్కెడలను వాడుతున్నారనే ఆరోపిస్తున్నారు రేషన్ లబ్ధిదారులు.
చౌకధరల దుకాణాల్లో బియ్యం, గోదుమలు, చక్కెర పంపిణీకి తక్కెడలను వినియోగిస్తున్నారు. ప్రతి లబ్ధిదారుడు కాంట తూకం కారణంగా సరుకులు తక్కువ వస్తున్నాయని చెబుతున్నారు. తూకాల్లో మోసాల గురించి వినియోగదారులు డీలర్లను అడితే ఎక్కువో, తక్కువో వస్తాయి అని దబాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలు సరిగా పనిచేయడం లేదని, విద్యుత్ ఉంటనే పనిచేస్తాయి లేదంటే పనిచేయవు అని డీలర్లు చెబుతున్నారు. దీంతో పాత తక్కెడలను వాడుతున్నామని డీలర్లు వివరిస్తున్నారు. డీలర్లు మాత్రం ఎలక్ట్రానిక్ కాంటాలకు బదులు తక్కెడలను వాడుతూ తూకాల్లో తమను మోసం చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు.
ఎలక్ట్రానిక్ కాంటాలను వాడాల్సిందే...
ప్రతి రేషన్ షాపుల్లో తక్కెడలను ఉపయోగిస్తున్నారు. కానీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని, ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు ప్రతి రేషన్ షాపుల్లో తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ కాంటాలను వాడేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. ప్రతి రేషన్ దుకాణంలో ఎలక్ట్రానిక్ కాంటాలు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. తూనికల్లో మోసాలను అరికట్టాలని కోరుతున్నారు.