రేషన్ కొరత..
-
చాలని సరుకులు
-
కార్డుదారుల ఇబ్బందులు
-
పత్తాలేని పామాయిల్
-
గోధుమలదీ అదేపరిస్థితి
-
కానరాని కందిపప్పు
-
అరకొర చక్కెర
మేడిపెల్లి: గ్రామీణ ప్రాంతాలు వర్షాలు లేక అల్లాడుతున్నాయి. పంటలు పండక రైతు కుటుంబాల వలస బాటపట్టాయి. పల్లెను పట్టుకుని ఉంటున్న జనం రేషన్ దుకాణాల ద్వారా అందే సరుకుల ఆధారంగా ఆకలి తీర్చుకుంటున్నారు. అయితే, పేదలకు అందాల్సిన నిత్యావసరాలు సక్రమంగా పంపిణీ కావడంలేదు. దీంతో కార్డుదారులు అర్ధాకలితో అలమటిస్తున్నారు.
మేడిపెల్లి మండలంలో 15,995 ఆహార భద్రత కార్డులుండగా 41,346మంది లబ్ధిదారులు ఉన్నారని రికార్డులు చెబుతున్నాయి. సరుకులు పంపిణీ చేయడానికి 28 రేషన్‌షాప్‌లు ఏర్పాటు చేశారు. ప్రనెలా 2,723 క్వింటాళ్ల బియ్యం, 159 క్వింటాళ్ల చక్కెర, 15,144 పామాయిల్ ప్యాకెట్లు, 15,995 క్వింటాళ్ల గోధుమలు, 15,995 లీటర్ల కిరోసిన్, 15,995 కిలోల కందిపప్పు సరఫరా కావాల్సి ఉంది. ఆర్నెల్లుగా సరుకులు సక్రమంగా రావడంలేదు. బియ్యం, కిరోసిన్‌నే సరిపెడుతున్నారు. జూలైలో కేవలం బియ్యం, చక్కెరే పోశారు. ఇదేమిటని డీలర్లను అడిగితే.. పైనుంచి రాలేదని చెబుతున్నారు. అసలే కరువు.. ఆపై చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరలు.. కూలీనాలీ చేసుకునే పేదలు బహిరంగ మార్కెట్‌లో పెద్దమెుత్తంలో ధరలు చెల్లించి నిత్యావసరాలు కొనుగోలు చేయలేకపోతున్నారు.
రేషన్ దుకాణం, బహిరంగ మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు(కిలో రూ.లలో)
సరుకు రేషన్‌దుకాణం మార్కెట్
చక్కెర 13.50 40
గోధుమపిండి 16 30
పామాయిల్ 40 80
చింతపండు 60 120
కందిపప్పు 50 150
పేదల కడుపుకొడుతున్నరు – పుల్లూరి దేవయ్య, గోవిందారం
వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు రేషన్‌షాపుల్లో అన్ని సరుకులు ఇచ్చిండ్రు. పేదలకు రెండుపూటలా కడుపునిండా తిండి దొరికేది. ఇప్పుడు సరుకులు సరిగా ఇస్తలేరు. కిరాణాల్లో ఎక్కువ ధర పెట్టి కొనుడైతంది.
తొమ్మిది సరుకులిచ్చిండ్రు – జంగంపెల్లి విజయ్, మోత్కురావుపేట
కాంగ్రెస్ హయాంలో నూటా ఎనబై ఐదు రూపాయలకే తొమ్మిది రకాల సరుకులను రేషన్‌షాపుల ద్వారా అందజేసింది. పేదప్రజలకు అవసరమైన నిత్యావసరాలు తక్కువ ధరకే వచ్చినయి. ఇప్పుడు బియ్యమే ఇస్తే ఏం లాభం?
గోదాముల నుంచి రావడంలేదు – కె.వసంత, తహసీల్దార్
అన్ని సరుకుల కోసం రేషన్ డీలర్లు డీడీలు చెల్లించారు. గోదాముల్లోనే సరుకులు లేవు. పైనుంచి సరుకులు రావడం లేదు. ఉన్నవాటినే కార్డుదారులకు అందజేస్తున్నాం. ఈనెలలో బియ్యం, కిరోసిన్, చక్కెర వచ్చింది. వాటిని పంపిణీ చేశాం.