కష్టాలు ’డబ్బు’ల్
కష్టాలు ’డబ్బు’ల్
Published Wed, Mar 1 2017 11:30 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM
రేషన్ సరుకుల పంపిణీలో నగదు రహిత విధానం
తొలిరోజే బెడిసి కొట్టిన ప్రయోగం
2.40 శాతం మందికే సరుకుల పంపిణీ
లక్షలాది మందికి బ్యాంకు ఖాతాలు లేకున్నా ఖాతరు చేయని ప్రభుత్వం
కొవ్వూరు :
నగదు రహిత విధానమంటూ ప్రభుత్వం పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. రేషన్ సరుకులపై ఆధారపడి జీవించే బడుగు జీవులపై బలవంతంగా క్యాష్‌లెస్ విధానాన్ని ప్రయోగిస్తోంది. మార్చిలో నూరుశాతం నగదు రహిత విధానంలోనే సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో తొలిరోజైన బుధవారం డబ్బు తీసుకుని రేషన్ షాపులకు వెళ్లిన వారిని డీలర్లు సరుకులు ఇవ్వకుండా వెనక్కి పంపించేశారు. ఇదిలా ఉంటే బ్యాంకుల సర్వర్లు పని చేయకపోవడంతో ఉదయం 10.30 గంటల నుంచి నగదు రహిత విధానంలో రేషన్ సరుకుల పంపిణీకి బ్రేక్ పడింది. జిల్లా వ్యాప్తంగా 11,96,775 రేషన్ కార్డులు, 2,163 చౌక ధరల దుకాణలున్నాయి. మొత్తం రేషన్ కార్డుల్లో 32,49,664 మంది సభ్యులుగా నమోదై ఉన్నారు. తొలిరోజు 28,545 కార్డుదారులకు మాత్రమే బియ్యం పంపిణీ చేశారు. ప్రతి నెలా ఐదో తేదీ నాటికే 90 శాతం సరుకుల పంపిణీ పూర్తి చేసేవారు. అంటే రోజుకు సగటున 23 శాతం రేషన్ పంపిణీ పూర్తయ్యేది. అటువంటిది ఈనెల మొదటి రోజు నగదు రహిత విధానం పుణ్యమా అని జిల్లాలో 2.40 శాతం కార్డుదారులకు మాత్రమే సరుకులు ఇవ్వగలిగారు
బ్యాంక్ ఖాతాలు లేకపోయినా..
కార్డుదారుల్లో చాలా మందికి బ్యాంక్ ఖాతాలు లేవు. ఈ పరిస్ధితుల్లో క్యాష్ లెస్ విధానం అమలు సాధ్యం కాదని అధికారులకు తెలిసినా బలవంతపు ప్రయోగాలతో జనాన్ని అవస్థల పాల్జేస్తున్నారు. సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా పేదలపై ఒత్తిడి పెంచుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. నగదు రహిత విధానంలో రేషన్ సరుకులు పొందాలంటే బ్యాంకు ఖాతాలో కనీసం రూ.100 నగదు ఉండాలి. ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకునే కూలీలకు ఈ విధానం ఎంతవరకు ఉపకరిస్తుందనేది ప్రశ్న. బ్యాంక్ ఖాతాలు ఉన్నా ఆధార్ అనుసంధానమైతేనే వారి పేర్లు డేటా మ్యాపింగ్‌లోకి వెళతాయి. అలా వెళ్లిన వారి ఖాతాలో సొమ్ములుంటే రేషన్ సరుకులు పొందే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కాకుండానే నగదు రహిత విధానం నూరుశాతం అమలు చేయడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు.
Advertisement