రజాకార్ల వారసుల పార్టీ మజ్లిస్
రజాకార్ల వారసుల పార్టీ మజ్లిస్
Published Sun, Sep 11 2016 12:19 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
హన్మకొండ : తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. భారతీయ జనతా యువమోర్చా(బీజేవైఎం) గ్రేటర్ వరంగల్ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తిరంగా యాత్రను హన్మకొండలోని తెలంగాణ అమరుల కీర్తి స్థూపం వద్ద ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా పార్టీ శ్రేణులు జాతీయ జెండాలను చేతబూని ద్విచక్రవాహన ర్యాలీలో పాల్గొన్నాయి. ర్యాలీ పట్టణంలో ప్రధాన వీధుల మీదుగా ఖిలా వరంగల్ వరకు జరిగింది. అక్కడ స్వాతంత్య్ర సమరయోధుడు బత్తిని మెుగిలయ్య చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వరంగల్ కాశిబుగ్గ వెంకట్రామ జంక్షన్‌లోని సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాగా, యాత్ర ప్రారంభించిన సందర్భంగా నల్లు ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ రజాకార్ల వారసుల పార్టీ ఎంఐఎంతో ఉన్న లోపాయికారీ ఒప్పందం వల్లే టీఆర్‌ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేందుకు సాహసించడం లేదన్నారు. ఆ రోజున బీజేపీ ఆధ్వర్యంలో వాడవాడలా జాతీయ జెండాలు ఎగురవేస్తామన్నారు. బీజేవైఎం గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు సాంబయ్య, బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్ టి.రాజేశ్వర్‌రావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మారావు, రాష్ట్ర కార్యదర్శి రావు పద్మ, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రాకేష్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రంజిత్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement