
ఆస్పత్రిలో ఆర్డీఓ విచారణ
– డబ్బులు తీసుకుంటున్నారని రోగుల బంధువుల ఫిర్యాదు
నల్లగొండ రూరల్
చేయి చాపుతాం...ఇస్తేనే తీసుకుంటాం సార్ అని ఆస్పత్రి సిబ్బంది...కాదూ సార్ వంద ఇస్తే భిక్షం ఇస్తున్నావా అంటు ముఖంపై విసిరేస్తున్నారు...అడిగినంత ఇవ్వకపోతే రాబందుల్లా వేధిస్తున్నారు.. అంటూ విచరాణాధికారి ముందు రోగులు తమ గోడును వెల్లబోసుకున్నారు. జలగలే నయం అనే శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఆయన ఆదేశాల మేరకు నల్లగొండ ఆర్డీఓ ఇ.వెంకటాచారి శనివారం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి కాన్పులవార్డులో పనిచేసే సిబ్బందిని, రోగుల కుటుంబ సభ్యులను విచారించారు.
విచారణ సాగింది ఇలా..
ఆర్డీఓ ః ఎంత తీసుకుంటున్నారమ్మా అంటూ సిబ్బందిని ప్రశ్నించారు.
సిబ్బంది ః చేయి చాపుతున్నాం...ఇస్తే తీసుకుంటున్నాం...రూ.100, 50 ఇస్తున్నారు సార్.
రోగిబంధువు ః కాదు సార్ రాబందుల్లా పీక్కుతింటున్నారు. ప్రతిపనికి ఒక రేటు ఫిక్స్ చేసుకుని ఇచ్చేంత వరకు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.
ఆర్డీఓ ః ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారంటు సిబ్బందిని నిలదీత
సిబ్బంది ః జీతాలు పెరిగి దగ్గర నుంచి తీసుకోవడం లేదు సార్...
రోగి బంధువు ః డాక్టర్లు వచ్చిపోయేంత వరకు బాగానే ఉంటారు. తరువాత డబ్బుల కోసం పీడిస్తున్నారు. ప్రైవేటు దవాఖానాకు ఇక్కడకు ఏం తేడా లేదు సార్.
ఆర్డీవో ః నీ జీతం ఎంత సిబ్బందికి ప్రశ్న
సిబ్బంది ః రూ.40వేలు సార్...
ఆర్డీఓ ః రూ.40వేల జీతం సరిపోవడం లేదా...ప్రభుత్వం ఇంత జీతం ఇచ్చి నియమిస్తే విధులు నిర్వహించకుండా రోగులను ఇబ్బంది పెట్టడం వలన జిల్లా పరిపాలనకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చినట్లవుతుంది. ఆస్పత్రి నుంచి వెళ్లేపోయే వరకు ఒక్కో పేషెంట్ దగ్గర రూ.6 నుంచి 8వేల వరకు అడుగుతున్నట్లు చెబుతున్నారు.
రోగిబంధవు ః రూ.100 ఇస్తే ముఖంపై విసిరారు సార్...ఇబ్బంది పెడుతున్నారని వారు అడిగినంత ఇచ్చాను. పక్క బెడ్‌పై ఉన్న పేషెంట్ భర్త డబ్బులు లేవని దండం పెట్టినా వినిపించుకోలేదు. ఆటో నడుపుతున్న తెలిసిన వ్యక్తి దగ్గరకు వెళ్లి బతిమిలాడి డబ్బులు తెచ్చుకుని సిబ్బందికిచ్చినా చెప్పి ఏడ్చాడు సార్. పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోండి సార్.
ఆర్డీవో ః వైద్యులు ఈ విషయాలు మీ దృష్టికి వచ్చాయా...
వైద్యులు ః మేము బాగానే విధులు నిర్వహిస్తున్నాం. సిబ్బంది వలనే ఆస్పత్రికి చెడ్డపేరు వస్తోంది. పనిష్‌మెంట్ లేకపోవడం వలనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. అయితే డబ్బులు తీసుకుంటున్నారనే మాకు చెప్పినప్పుడు పద్ధతి మార్చుకోవాలని సిబ్బందిని హెచ్చరిస్తున్నాం సార్.