
సాగునీటి ప్రత్యామ్నాయ ప్రణాళికను వెల్లడించాలి
అవనిగడ్డ : పట్టిసీమలో మరో ఐదారు రోజులు మాత్రమే నీరందే పరిస్థి్ధతి ఉందని, కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోకుండా ఉండేందుకు సాగునీటి పత్యామ్నాయ ప్రణాళికను వెల్లడించాలని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది ఆగస్టు నుంచి సరిగా వర్షాలు పడకపోవడంతో రైతులు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మరో పది రోజులు ఇదే పరిస్థితి ఉంటే డెల్టాలో చాలాచోట్ల పంటలు ఎండిపోతాయని చెప్పారు. ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలను ప్రభుత్వం రూపొందించుకోవాలని, కృష్ణా డెల్టాలో ఎకరం పొలం ఎండిపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాల్సి వస్తుందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా చరిత్రలో ఇంతటి తీవ్ర సంక్షోభం ఎప్పుడూ ఎదుర్కోలేదని, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోక పోతే రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని చెప్పారు. డెల్టా పరిరక్షకుడిగా చెప్పుకునే ప్రజాప్రతినిధి బుద్ధప్రసాద్‌కు రైతుల గోడు పట్టడంలేదా? అని ప్రశ్నించారు. రెండేళ్లుగా సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఏనాడైనా సీఎం చంద్రబాబును సాగునీరు కావాలని అడిగారా? అని మండిపడ్డారు. పంట చేతికొచ్చే వరకూ సాగునీటిని అందించేందుకు చర్యలు తసుకోవాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో రైతు సమస్యలపై పోరాడేందుకు కృష్ణా జిల్లాలో సింహాద్రి రమేష్‌బాబు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో కొవ్వూరు త్రినాథరెడ్డి, అనంతపురం జిల్లా సింగమల కన్వీనర్ గరిమెల శరత్‌చంద్రరెడ్డిని రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా వైఎస్సార్‌పీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారన్నారు.