పోటా.. పోటీ !
♦ ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యుల కోసం గ్రామాల్లో తీవ్ర ప్రయత్నాలు
♦ వర్గాల వారీగా ఎమ్మెల్యేలకు పేర్లు ప్రతిపాదిస్తున్న నాయకులు
♦ జిల్లాలో 566 రెవెన్యూ గ్రామాల్లో నియామకాలకు కసరత్తు
♦ అవగాహన సదస్సులలో చర్చిస్తున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు
♦ అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట ద్వితీయశ్రేణి నేతల హడావుడి
♦ ఇవేం పదవులంటూ భగ్గుమంటున్న ప్రతిపక్ష పార్టీలు
సాక్షిప్రతినిధి, నల్లగొండ :
రైతు సమన్వయ సమితుల (ఆర్‌ఎస్‌ఎస్)తో గ్రామాల్లో అధికార పార్టీ నేతల హడావుడి నెలకొంది. ఈనెల 9 వరకు గ్రామ, మండల, జిల్లాస్థాయిలో నియామకాలు పూర్తి చేయాలని ఏకంగా సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ పెట్టడంతో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అవగాహన సదస్సుల కోసం గ్రామాలబాట పట్టారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 566 రెవెన్యూ గ్రామ పంచాయతీల్లో ఈ కసరత్తు మొదలైంది. కొన్ని గ్రామాల సభ్యుల నియామకాలు చేసినా.. ఇంకా పూర్తిస్థాయిలో కొలిక్కిరాలేదు. ఈ నియామకాలపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. గ్రామస్థాయి అధికార పార్టీ నేతలనే ఆర్‌ఎస్‌ఎస్‌లలో నియమిస్తున్నారని.. అధికారులు చేతులు ఎత్తేయడంతో అంతా ఆ పార్టీనే చూసుకుంటుందని, అసలు ఇవేం పదవులు..? అంటూ మండిపడుతున్నారు.
జిల్లాలో 566 రెవెన్యూ గ్రామాల్లో.. ఒక్కో గ్రామానికి 15మంది సభ్యులను నియమించాలి. జిల్లావ్యాప్తంగా మొత్తంగా 8,490 మంది సభ్యుల నియామకాలు చేయాలి. గ్రామస్థాయిలో ఆర్‌ఎస్‌ఎస్‌లకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఈ పదవుల కోసం.. గ్రామాల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఇతర పార్టీలనుంచి టీఆర్‌ఎస్‌లో చేరడంతో చాలా గ్రామాల్లో వర్గాలున్నాయి. అయితే ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలను కలిసి తమనుంచి ఈ పేర్లు ఉండాలని ప్రతిపాదిస్తున్నారు. ఒక్కో గ్రామంలో మూడు, నాలుగు వర్గాలు ఉండడం.. ఎమ్మెల్యేలకు వేర్వేరుగా జాబితా ఇస్తున్నారు. దీంతో ఈ నియామకాలు ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. పార్టీలోని అన్ని వర్గాలకు సంబంధించిన గ్రామస్థాయి ముఖ్య నేతలను ఎమ్మెల్యేలు తమ వద్దకు పిలిపించుకొని నచ్చజెబుతున్నా.. ఎవరికివారు తమ వర్గం వారే ఎక్కువ మంది సభ్యులుగా ఉండాలని పట్టుబడుతున్నారు.
ఒక తాటిపైకి రాని గ్రామాలకు సంబంధించి ఎమ్మెల్యేలు మాత్రం.. చివరకు మేం ఫైనల్ చేస్తాం..‘మీరు వెళ్లండి’ అంటూ పంపిస్తున్నారు. దీంతో పదవులు మాకే వస్తాయని, పక్కవర్గానికి ఒక్క సభ్యుడు కూడా ఇవ్వరంటూ గ్రామస్థాయి నేతలు ఆశల పల్లకిలో ఉన్నారు. ఎమ్మెల్యేలు మాత్రం ఎంపిక చేసే 15 మంది సభ్యుల్లో ఎవరికి గ్రామంలో పట్టుంది, ఎక్కువగా చదువుకున్నది ఎవరు..?, అని తమ అనుంగు మండలస్థాయి నేతల ద్వారా ఆరా తీస్తున్నట్లు సమాచారం.
గ్రామస్థాయి సభ్యుడు కావడమే కీలకం..
ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుల విషయంలో ఉత్తర్వులను సవరించి తాజాగా వెలువరించింది. గ్రామ స్థాయి సభ్యులుగా నియమితులైన వారిలో ఒక్కరిద్దరిని మండలస్థాయి, అక్కడినుంచి జిల్లా స్థాయికి తీసుకుంటామని పేర్కొంది. దీంతో గ్రామ ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడి పదవి కీలకమైంది. మండల, జిల్లాస్థాయి పదవుల కోసం పోటీపడే నేతలు ముందుగా వారి గ్రామంలో సభ్యుడై ఉండాలి. గతంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లుగా మాజీ ప్రతినిధులుగా ఉన్న వారంతా ఈ పదవులకు పోటీ పడుతున్నారు. గ్రామస్థాయిలో వీరు తమపేర్లు పెట్టాలని ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండడంతో.. గ్రామంలో ఉన్న నేతలు మాత్రం వాళ్లు ఇంతకు ముందే ప్రజాప్రతినిధులుగా పదవులు అనుభవించారని.., మళ్లీ వారికి ఇవ్వొద్దని, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని.. ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నచోట గ్రామనేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి.
అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట..
ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట ఆ పార్టీ ముఖ్య నేతలే ఈ పదవుల పంపకాల బాధ్యతలు భుజానకెత్తుకున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎంపీని తీసుకెళ్లి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో గ్రామంలో బలంగా పనిచేసిందేవరు..?, తమ సర్పంచ్‌లు సూచించే పేర్లలో ఎవరు తమకు విశ్వాసపాత్రులుగా ఉంటారోనని లెక్కలేసుకుంటూ.. ఎవరిని ఆర్‌ఎస్‌ఎస్‌లల్లో పెట్టాలన్న యోచనలో ఉన్నారు. రైతు సమన్వయ సభ్యుల నియామకాల కోలాహలంతో మొత్తంగా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలను తలపించే వాతావరణమే ఏర్పడింది. వర్గాలుగా ఎవరికివారు క్యాంపులు ఏర్పాటు చేసుకుంటూ తమకే అన్ని పదవులు వస్తాయంటూ చర్చల్లో మునిగారు. ‘ఎమ్మెల్యేలు.. మేం ఫైనల్ చేస్తాం’ అని చెప్పినా తమకు ఎప్పుడు పిలుపువస్తుందోనని నియోజకవర్గ నేతలను ఆరా తీస్తున్నారు.