కడుపు ఉబ్బుతోంది..
= బాధతో విలవిలలాడుతున్న బాలుడు
= తల్లడిల్లిపోతున్న తల్లిదండ్రులు
= వైద్య సాయం కోసం వేడుకోలు
కడుపు నిండా తిండి తినలేక.. కంటినిండా నిద్రపోలేక.. క్షణక్షణం భరించలేని బాధతో విలవిలలాడుతున్న తనయుడిని చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో చూపించినా జబ్బు నయం కాకపోవడంతో కుమిలిపోతున్నారు. తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు.
బుక్కపట్నం మండలం గూనిపల్లికి చెందిన దళిత ఆదెప్ప, శ్రీలతలు దంపతులు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు లోకేశ్ నాలుగో తరగతి చదువుతున్నాడు. ఎంతో చలాకీగా ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లివచ్చేవాడు. అలాంటి ఈ చిన్నారికి ఆరు నెలల క్రితం కడుపునొప్పి వచ్చింది. క్రమేణా కడుపు ఉబ్బుతుండటంతో పలు ఆస్పత్రుల్లో చూపించారు.
ఆర్డీటీ ఆస్పత్రిలోను, కర్నూలు ప్రభుత్వాస్పత్రిలోనూ చికిత్స చేయించారు. కడుపు ఉబ్బరం వచ్చి కాలేయం దెబ్బతిందంటూ కొందరు వైద్యులు, టీబీ లక్షణాలు ఉన్నాయని మరికొందరు వైద్యులు తెలిపి మందులిచ్చారు. అయినా జబ్బు నయం కాలేదు. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తోంది. విపరీతమైన బాధ ఉంటుండటంతో రాత్రిపూట నిద్రకూడా పట్టడం లేదు. అసలు ఇంతకూ ఇది ఏ జబ్బో తెలుసుకుని, బాగు చేయించుకోవడానికి పెద్ద ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేక తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి తమ కుమారుడికి వైద్యం అందించాలని ప్రాధేయపడుతున్నారు. .
దాతలు సంప్రదించవలసిన చిరునామా
సాకే ఆదెప్ప
బ్యాంకు ఖాతా నంబరు : 32697931879
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, బుక్కపట్నం
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ : ఎస్‌బీఐఎన్ 4412
సెల్ నంబరు : 99632 10389