
జోనల్ వ్యవస్థ రద్దుతో యువతకు నష్టం
రాష్ట్రంలో జోనల్ వ్యవస్థను రద్దుచేస్తే గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు నష్టపోయే ప్రమాదముందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు.
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జోనల్ వ్యవస్థను రద్దుచేస్తే గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు నష్టపోయే ప్రమాదముందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన టీటీడీపీ న్యాయవిభాగం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థల ఒత్తిడితోనే జోనల్ వ్యవస్థ రద్దు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. పేద, గ్రామీణ విద్యార్థులకు అన్యాయం చేస్తే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
జిల్లాల పునర్విభజనలో ఒక జిల్లాలోని ప్రాంతాలన్నీ మరొక జిల్లాలోకి విలీనం చేయడం ద్వారా జోనల్ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జోనల్ వ్యవస్థను కొనసాగిస్తే న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ జోనల్ వ్యవస్థను రద్దుచేశారని విమర్శించారు. ఈ సమావేశంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి ఇ.పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీటీడీపీ న్యాయవిభాగం అధ్యక్షుడిగా గంధం గురుమూర్తి, మరో 67 మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేశారు.