రెవెన్యూ రగడ
రెవెన్యూ రగడ
Published Sun, Feb 12 2017 1:11 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పరిపాలనలో కీలకమైన రెవెన్యూ శాఖలో మరోసారి రగడ మొదలైంది. కలెక్టర్ కాటంనేని భాస్కర్, రెవెన్యూ ఉద్యోగుల మధ్య వివాదం రాజుకుంది. గతంలోనూ కలెక్టర్ తీరుకు నిరసనగా ఉద్యోగులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. తాజాగా.. రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. వర్క్ టు రూల్ (నిబంధనల మేరకే పని) పాటిస్తామని ప్రకటించారు. ఉద్యోగుల విషయంలో కలెక్టర్ తీరు
బాగోలేదని, ఆయన పద్ధతి మార్చుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీనిపై కలెక్టర్ సైతం స్పందించారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత కోపాలు,
కక్షలు లేవన్నారు. తాను మారేది లేదని.. ఇలాగే ఉంటానని తెగేసి చెప్పారు. ఉద్యోగుల సంఘ ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం మామూలేనని ఆయన కొట్టిపారేశారు. వివరాల్లోకి వెళితే.. కలెక్టర్ భాస్కర్ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్‌లో భీమవరం తహసీల్దార్ చవాకుల
ప్రసాద్‌ను కలెక్టర్ దుర్భాషలాడారు. దీనికి నిరసనగా ఏలూరులోని రెవెన్యూ అసోసియేషన్ భవనంలో ఎన్జీఓ నేతలు సమావేశమయ్యారు. అధికారులు, ఉద్యోగుల విషయంలో కలెక్టర్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి వీడియో కాన్ఫెరెన్స్‌లో రెవెన్యూ ఉద్యోగులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాను పాలించే కలెక్టర్ తీరు మారకపోతే భవిష్యత్‌లో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బెదిరించి పనిచేయించడం మానుకోవాలని.. ప్రేమతో పని చేయించుకోవాలని కోరారు. బెదిరించే ధోరణిలో ఉంటే రెవెన్యూ యంత్రాంగం ద్వేషిస్తుందని నాయకులు అన్నారు. సోమవరం నుంచి వర్క్ టు రూల్ పాటిస్తామని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే విధుల్లో ఉంటామని స్పష్టం చేశారు.
దేనికైనా రెడీ అన్నట్టుగా..
ఎన్జీవో నేతల అల్టిమేటంపై కలెక్టర్ సైతం తీవ్రంగానే స్పందించారు. వందసార్లు చెప్పినా పనులు చేయకపోతే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. జీతం తీసుకుంటున్నాం కాబట్టి పనిచేయాలన్న ఆలోచన వారికి ఉండాలన్నారు. రెవెన్యూ అసోసియేషన్ గతంలోనూ యూనియన్ ఎన్నికలకు ముందు ఇటువంటి ఆరోపణలు చేసిందని గుర్తు చేశారు. ఆరోపణలు చేయడం ఆ తర్వాత వచ్చి క్షమాపణ చెప్పడం కొంతమందికి అలవాటుగా మారిందన్నారు. కలెక్టరేట్‌లో డ్రైవర్‌గా పనిచేసి.. ఆ తరువాత 12 ఏళ్లపాటు కువైట్‌లో పనిచేసిన వ్యక్తిని తీసుకువచ్చి ఉద్యోగం ఇవ్వాలని తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి కోరాడని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ పరంగా పదవీ విరమణ లబ్ధి చేకూర్చాలని కోరగా.. ఆ పైరవీని తాను అంగీకరించలేదన్నారు. అందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఉద్యోగుల విమర్శలపై కలెక్టర్ తీవ్రంగానే ప్రతిస్పందించడంతో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన బాట పడతారా.. లేక మౌనంగా ఉండిపోతారా అన్నది సోమవారం తేలనుంది.
పని చేయకపోయినా ఊరుకోవాలా
– కలెక్టర్ భాస్కర్
ఏలూరు (సెంట్రల్) : ‘నాకు వ్యక్తిగత కోపాలు, కక్షలు లేవు. ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటున్న మనం ప్రజ లకు సకాలంలో పనులు చేయాలని చెబుతున్నా. వందసార్లు చెప్పినా పనులు చేయకపోతే చూస్తు ఊరుకోవాలా. పని చేయమంటే తిట్టినట్టుగా భావిస్తే ఎలా..’ రెవెన్యూ అసోసియేషన్ నాయకుల అల్టిమేటంపై కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పందిస్తూ అన్న మాటలివి. శనివారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన భాస్కర్ మాట్లాడుతూ జీతం తీసుకుంటున్నాం కాబట్టి పనిచేయాలనే ఆలోచన ఉద్యోగులకు ఉండాలన్నారు. రెవెన్యూ అసోసియేషన్ గతంలోనూ యూనియన్ ఎన్నికల ముందు ఇటువంటి ఆరోపణలు చేసిందన్నారు. త్వరలో ఆ సంఘ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ లబ్ధికోసం కొంతమంది ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆరోపణలు చేయడం, తరువాత వచ్చి క్షమాపణలు చెప్పుకోవడం అలవాటుగా మారిందని వ్యాఖ్యానిం చారు. ఇటువంటి ఆరోపణలకు స్పందిం చాల్సిన అవసరం తనకు లేదని, ప్రజ లకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ విషయాలను బహిర్గతం చేస్తున్నానని అన్నారు. భీమవరం తహసీల్దార్‌ను తాను దుర్భాషలాడానన్న ఆరోపణపై స్పందిస్తూ భీమవరంలో కాపురం ఉంటూ మొగల్తూరులో పనిచేసిన ప్రసాద్‌ను ఏలూరు బదిలీ చేశామని, ఇక్కడకు కూడా రోజూ భీమవరం నుంచి వచ్చి ఉద్యోగం చేస్తానంటే ఎలా అని ప్రశ్నిం చారు. ప్రసాద్ ఇక్కడ పనిచేసినప్పుడు ఆయన తీరులో మార్పు రాలేదన్నారు. ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో భీమవరం బదిలీ చేశామని, అయినా పనితీరులో మార్పు రాలేదన్నారు. అలాంటప్పుడు మందలించకూడదా అని ప్రశ్నించారు. ఏప్రిల్ నుంచి రెండు నెలల పాటు సమీక్షా సమావేశాలు నిర్వహించనని, అందరూ స్వేచ్ఛగా విధులు నిర్వర్తించుకోవచ్చని, ఆ తరువాత వివిధ శాఖల పనితీరు సమీక్షిస్తానని ఫలితాలు ఎలా ఉంటాయో మీడియా ప్రతినిధులు చూడొచ్చని కలెక్టర్ అన్నారు. ఏలూరు వీఆర్‌ఓ సర్టిఫికెట్ కోసం ఓ మహిళను రూ.2 వేలు లంచం డిమాండ్ చేస్తే ఆ సొమ్ము తాను ఇచ్చానని చెప్పారు. లం చాలు తీసుకుంటే ఊరుకోవాలా.. అటువంటి వారిని శిక్షించకపోతే సమాజంలో అవినీతి పెరగదా అని ప్రశ్నించారు. ఏయే రోజుల్లో సమీక్షిస్తానో ముందుగానే తెలియచేశామని, అధికారులు వారంలో రెండుసార్లు మించి సమావేశాలకు హాజరుకావాల్సిన పనిలేదని అన్నారు. మండల స్థాయి అధికారులతో వారంలో రెండుసార్లు వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. రూ.లక్షలు ఖర్చు చేసి రూ.కోట్లు సంపాదించాలనే ఆలోచనతో ఉండే అధికారులు తనకు అవసరం లేదని, నీతి, నిజాయితీలతో ప్రజలకు సేవలందించే అధికారులు కావాలని అన్నారు.
వర్క్ టు రూల్ పాటిస్తాం
– రెవెన్యూ అసోసియేషన్ నాయకుల అల్టిమేటం
ఏలూరు (మెట్రో) : ‘కలెక్టర్ తీరు మారాలి. లేదంటే మేమే మారతాం’ అంటూ కలెక్టర్ కాటంనేని భాస్కర్‌పై రెవెన్యూ అసోసియేషన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులోని జిల్లా రెవెన్యూ భవనంలో శనివారం కీలక సమావేశం జరిగింది. కలెక్టర్ ప్రవర్తన, ఉద్యోగులను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న తీరుపై అసోసియేషన్ నాయకులు నిరసన గళం విప్పారు. భాస్కర్ తీరుతో విసిగిపోతున్నామని.. ఆయన పద్ధతి మార్చుకోకుంటే ఎంతటి ఆందోళనకైనా సిద్ధమని ప్రకటించారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్.విద్యాసాగర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ సోమవారం నుంచి వర్క్ టు రూల్ పాటిస్తామని, ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకే పని చేస్తామని వెల్లడించారు. విధుల విషయంలో చిన్నచిన్న పొరపాట్లు, తప్పిదాలు ఏ ఉద్యోగికైనా సహజమని.. వాటిని పెద్దగా చూస్తూ కలెక్టర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడుగడుగునా రెవెన్యూ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. బాధ్యత గల హోదాలో ఉండి.. పని వేళలను కనీసం గుర్తించకుండా ‘డయల్ యువర్ కలెక్టర్’ అంటూ ఉదయాన్నే కార్యక్రమం నిర్వహిస్తున్నారని.. రాత్రి వేళ వీడియో కాన్ఫెరెన్స్‌లు ఏర్పాటు చేస్తూ ఉద్యోగుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. దీనివల్ల రెవెన్యూ ఉద్యోగులంతా మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అనారోగ్యం పాలవుతున్నారని వివరించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్‌లో భీమవరం తహసీల్దార్ చవాకుల ప్రసాద్‌ను జిల్లా అధికారులంతా చూస్తుం డగా కలెక్టర్ దుర్భాషలాడారని, గతంలోనూ అనేక మందితో నోటికొచ్చినట్టు మాట్లాడారని గుర్తు చేశారు. సమావేశంలో రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డీఏ నరసింహరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జీవీవీ సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ, పెదపాడు తహసీల్దార్ వీజీఎస్ కుమార్, అసోసియేట్ కార్యదర్శి, పెరవలి తహసీల్దార్ వై.జితేంద్ర, ఆర్గనైజింగ్ సెక్రటరీ, జీలుగుమిల్లి తహసీల్దార్ ఎం.రాజశేఖర్, కుకునూరు కార్యాలయ ఏఓ సుబ్బారావు, గోపాలపురం తహసీల్దార్ ఎన్.నరసింహమూర్తి, అత్తిలి తహసీల్దార్ జి.కనకరాజు, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.రమేష్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement