తిరకేసు!
ఆశల పల్లకీలో భూమా
– టీడీపీలో చిచ్చురేపుతున్న మంత్రి పదవి
– కష్టమేనంటున్న వ్యతిరేక వర్గం
– రౌడీషీట్ చుట్టూ రాజకీయం
– తెరపైకి తెలంగాణ వ్యవహారం
– రోజురోజుకు ముదురుతున్న వివాదం
– ఆసక్తికరంగా మారిన చర్చ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో పదవుల పందేరం కాస్తా మరోసారి చిచ్చురేపుతోంది. తమ నేతకు మంత్రి పదవి దక్కుతుందంటూ భూమా నాగిరెడ్డి అనుచరులు వాదిస్తుండగా.. అదేమీ లేదని మరో వర్గం పేర్కొంటోంది. మంత్రి పదవి ఇవ్వడంలో భాగంగానే రౌడీషీట్ ఎత్తివేసే ప్రక్రియ ప్రారంభమైందని ఆయన అనుచరుల్లో చర్చ జరుగుతోంది. అయితే.. అదేమీ లేదని మరో వర్గం కొట్టి పాడేస్తోంది. ఇందుకోసం వీరు తెలివిగా తెలంగాణలో తలసానికి మంత్రి పదవి ఇవ్వడంపై జరిగిన గొడవను తెరమీదకు తీసుకొస్తున్నట్లు సమాచారం. అలా.. పార్టీ మారినప్పటికీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మంత్రి పదవి ఇస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని చెబుతున్నారు. దసరా తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే చర్చ నేపథ్యంలో జిల్లాలో ఈ చర్చ కాస్తా ఆసక్తికరంగా మారింది.
అక్కడ అలా.. ఇక్కడ ఇలా
భూమాకు మంత్రి పదవి అప్పగించే విషయంలో అధికార పార్టీలోని నేతలే కొత్త చర్చను లేపుతున్నారు. ఒకపార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారిన తర్వాత.. కనీసం పదవులకు రాజీనామా చేయకుండా మంత్రి పదవి ఇచ్చారని పక్క రాష్ట్రంలో మన పార్టీనే గోల చేస్తున్న విషయాన్ని వీరు పేర్కొంటున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వ్యవహారంలో మనమే రచ్చ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ అదే తరహాలో పార్టీ మారిన వ్యక్తికి మంత్రి పదవి అప్పగిస్తే పార్టీ వాదనకు ఏం బలం ఉంటుందనే చర్చ జరుగుతోంది. అంతేకాకుండా మంత్రి తలసాని వ్యవహారంలో ఏకంగా గవర్నర్ వ్యవస్థనూ కించపరిచిన నేపథ్యంలో ఇక్కడ పార్టీ మారిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే.. అదే గవర్నర్‌ను ప్రమాణ స్వీకారం చేయించాలని కోరేందుకు తమకు మోహం ఎలా వస్తుందని అంటున్నారు. ఈ చర్చ అధికార పార్టీ నేతలతో పాటు అధినేతను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు తెలుస్తోంది.
రౌడీషీట్ ఎత్తేస్తారా?
అసలు రౌడీషీట్ ఎత్తివేసే విషయంలోనే అధికార పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదంత సులువైన వ్యవహారమేమీ కాదనే వాదన వినిపిస్తోంది. కేవలం ఆయన పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించి అభిప్రాయం తెలపాలని మాత్రమే జిల్లా పోలీసు యంత్రాంగానికి ప్రభుత్వం నుంచి లేఖ వచ్చిందని ఆయన వ్యతిరేక వర్గం వాదిస్తోంది. అయితే, అసలు మంత్రి పదవి వరించేందుకు ముందుగానే రౌడీషీట్ ఎత్తివేస్తారని భూమా అనుచరులు బలంగా పేర్కొంటున్నారు. మొత్తం మీద మంత్రిపదవుల వ్యవహారం కాస్తా జిల్లాలో మరోసారి ఇరువర్గాల మధ్య ఆసక్తికర పోరుకు తెరలేపినట్లు తెలుస్తోంది.