
మొక్కలను పరిశీలిస్తున్న ప్రియాంక
మెదక్‌జోన్: నాటిన మొక్కల విషయంలో తప్పుడు లెక్కలు చెబితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని, మొక్కలు చనిపోతే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎం క్యాంపు కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో హరితహారంపై విద్యాశాఖ, ఎంపీడీఓ, పోలీస్, ఎక్సైజ్, ఉపాధిహామీ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో హరితహారంలో నాటిన మొక్కల్లో తప్పుడు లెక్కలు చూపినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒక్కో శాఖలోని అధికారులు వారు మొక్కలు నాటే లక్ష్యం ఎంత? ఎన్ని మొక్కలు నాటారు. వాటిలో ఎన్ని చనిపోయాయి? ఎన్నింటిని రక్షించారు? అనే వివరాలతో పూర్తిస్థాయి లెక్కలు తనకు బుధవారం అందించాలని ఆదేశించారు. ఈ లెక్కల్లో తప్పులు ఉంటే చర్యలు తప్పవన్నారు. పోలీసులు మొక్కలు నాటినప్పటికీ వాటిని పరిరక్షించడంలో విఫలమైనట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. కొన్ని పాఠశాలల్లో ప్రహరీలు లేకున్నా మొక్కలను రక్షించారని, సంరక్షించాలనే తపన ఉంటే నాటిన ప్రతీ మొక్కను రక్షించవచ్చారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రాములు, డీఎఫ్‌ఓ పద్మజ,డీఈఓ విజయ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి,ఎస్‌ఐలు, ఎంఈఓలు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
పాఠశాల తనిఖీ..
కొల్చారం(నర్సాపూర్): ప్రభుత్వ పాఠశాలల్లో హరితహారం నిర్వహణ తీరుపై ఆరా తీసేందుకు మంగళవారం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ కొల్చారం మండలంలో సందర్శించారు. మండల పరిధిలోని అంసాన్‌పల్లి, వరిగుంతం ఉన్నత పాఠశాలలను సందర్శించిన ఆమె అక్కడి పాఠశాలల్లో హరితహారం మొక్కల పెంపకంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట జేసీ నగేష్, డీఎఫ్‌ఓ పద్మజారాణి, ఎంపీడీఓ వామనరావు, ఎంఈఓ నీలకంఠం, పాఠశాల సిబ్బంది ఉన్నారు.
మొక్కల పెంపకంపై హెచ్‌ఎంలతో సమీక్ష
నర్సాపూర్: విద్యార్థులకు విద్యతో పాటు చుట్టూ మంచి పర్యావరణం కూడా అవసరమని రాష్ట్ర హరితహారం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలతో పాఠశాలల్లో మొక్కల పెంపకంపై సమీక్ష నిర్వహించారు. హరితహారంలో మొక్కల పెంపకంలో జిల్లా వెనుకబడిందని విచారం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో జిల్లా ముందంజలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నర్సాపూర్, కొల్చారం తదితర మండలాల్లో పాఠశాలల్లో మొక్కల పెంపకం బాగుందని సంబంధిత హెచ్‌ఎంలను అభినందించారు. హెచ్‌ఎంలు మొక్కల పెంపకంపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రహరీలు లేని పాఠశాలల చుట్టూ గచ్చికాయ మొక్కలు నాటితే పశువులు రాకుండా ఉండడంతో పాటు నాటిన ఇతర మొక్కలకు రక్షణ ఉంటుందన్నారు. సమావేశంలో జేసీ నగేశ్, డీఎఫ్‌ఓ పద్మజా రాణి, నర్సాపూర్ ఆర్‌డీఓ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీ దశరథ్, ఎఫ్‌ఆర్‌ఓ రాఘవేందర్‌రావు, ఎంఈఓ జెమినీ కుమారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment