– కలెక్టర్ కేవీ సత్యనారాయణ
రిమ్స్ (కడప అర్బన్):రిమ్స్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ అన్నారు. రిమ్స్ ప్రారంభమై 10 వసంతాలను పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శనివారం రాత్రి రిమ్స్ ఆడిటోరియంలో కాలేజ్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పవిత్రమైన వైద్య వృత్తిలో వున్న వారు కోర్సు పూర్తి కాగానే ప్రైవేట్ ప్రాక్టీస్‌లను పెట్టుకుని ధనార్జనే ధ్యేయంగా ముందుకు వెళ్లకుండా ప్రజలకు సేవ చేసే వైద్యులుగా పేరు తెచ్చుకోవాలన్నారు. రిమ్స్‌కు ఎంఆర్‌ఐ స్కానింగ్ తెప్పిస్తామన్నారు. వైద్యవిద్యార్థుల్లో విశేష ప్రతిభ కనపర్చిన వారికి నగదు రివార్డులను, గోల్డ్ మెడల్స్‌ను కలెక్టర్ అందజేశారు.రిమ్స్ డైరెక్టర్ మాజేటి శశిధర్, ప్రిన్సిపల్‌డాక్టర్ ఎం. వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ డాక్టర్ టి. గిరిధర్, ఆర్‌ఎంఓ డాక్టర్ జంగం వెంకటశివ, రిమ్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎం. సురేశ్వర్ రెడ్డి, రిమ్స్ హెచ్‌డీఎస్ చైర్మన్ మురళీధర్ రెడ్డి, సభ్యుడు డాక్టర్ వారణాసి ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.