
ఘనంగా ఆర్‌జేడీ ఉద్యోగ విరమణ
వైవీయూ:
డిగ్రీ కళాశాలల ప్రాంతీయ సంయుక్త సంచాలకులు డాక్టర్ కె. మల్లేశ్వరి ఉద్యోగ విరమణ సన్మానసభ ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ సన్మానసభలో పలువురు వక్తలు ఆమె సేవలను కొనియాడారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి. సుబ్బలక్షుమ్మ మాట్లాడుతూ అధ్యాపక వృత్తిని ఎంతో బాధ్యతగా భావించి సేవలందించారని కొనియాడారు. ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపల్ డా. ఎన్. సుబ్బనరసయ్య మాట్లాడుతూ అధ్యాపకురాలుగా బోధనావృత్తిలోకి ప్రవేశించి పలు పదోన్నతులు పొంది ఆర్‌జేడీగా ఉద్యోగ విరమణ చేయడం సంతోషకరమన్నారు.
చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆనంద్‌రెడ్డి, కర్నూలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సి.వి. రాజేశ్వరి, ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వి. శివారెడ్డి, ఏపీ ఎన్‌జీఓ నాన్‌టీచింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ బ్రహ్మానందరెడ్డి తదితరులు ఆమె సేవలను కొనియాడారు. అనంతరం సన్మాన గ్రహీత మల్లేశ్వరి మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అధ్యాపక వృత్తి ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. అనంతరం ఆమెను ఎన్‌జీఓ నాయకులు, అధ్యాపక బృందం, బోధనేతర సిబ్బంది ఘనంగా సన్మానించారు. వైవీయూ పాలకమండలి సభ్యులు డా. ఎస్. రామచంద్రయ్య, డీన్ ఆచార్య జి. సాంబశివారెడ్డి, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.