‘స్పోర్ట్స్‌మీట్’ అదిరిపోవాలి !
• అన్ని కళాశాలల విద్యార్థులు పాల్గొనేలా చూడాలి
• ప్రాక్టికల్స్ తరగతులు ‘మమ’ అనిపిస్తే చర్యలు
• ఇంటర్ విద్య ఆర్జేటీ వెంకటరమణ
అనంతపురం ఎడ్యుకేషన్ : జూనియర్ కళాశాలల విద్యార్థులకు నిర్వహించే ‘స్పోర్ట్స్‌మీట్’ నిర్వహణ అదిరిపోవాలని ఇంటర్ విద్య రీజనల్ జాయింట్ డైరెక్టర్ (కడప) వెంకటరమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఒకేషనల్ జూనియర్ కళాశాలలో అనంతపురం జిల్లా జూనియర్ కళాశాలల అథ్లెటిక్ అసోసియేషన్ (ఏడీజేసీఏఏ) సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్జేడీ మాట్లాడుతూ స్పోర్ట్స్‌మీట్‌లో అన్ని యాజమాన్యాలు భాగస్వాములు కావాలని కోరారు. క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువు అంటూ పిల్లలపై మానసిక ఒత్తిడి పెంచుతున్నారన్నారు.
క్రీడల ద్వారా పిల్లల్లో మానసిక ప్రశాంతతో పాటు శారీరక అభివద్ధి పెరుగుతుందన్నారు. ఈసారి ప్రాక్టికల్స్ జంబ్లింగ్‌లోనే ఉంటాయని ఇప్పటి నుంచే దష్టి సారించి ఎప్పటికప్పుడు ప్రాక్టికల్ తరగతులు నిర్వహించాలని సూచించారు. అలా కాకుండా చివరల్లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రాక్టికల్ తరగతులు ‘మమ’ అనిపిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. తరచూ అన్ని కళాశాలలు తనిఖీలుల చేస్తామని, విద్యార్థులతో మాట్లాడుతామని, రికార్డులు పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో ఎక్కడైనా ల్యాబ్ పరికరాలు తక్కువ ఉంటే తమ దష్టికి తేవాలన్నారు. ఆర్‌ఐఓ వెంకటేశులు మాట్లాడుతూ ‘స్పోర్ట్స్‌మీట్’ నిర్వహణలో గతేడాది పడిన ఇబ్బందులు ఈసారి తలెత్తకూడదన్నారు. అందరూ ఛాలెంజ్‌గా తీసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కొరవడిన చిత్తశుద్ధి
విద్యార్థుల క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నా క్షేత్రస్థాయిలో నిర్వహణ తూతూమంత్రంగా ఉంటోందనడానికి హాజరైన ప్రిన్సిపాళ్లు, పీడీలే నిదర్శనం. జిల్లాలో అన్ని యాజమాన్యాల జూనియర్ కళాశాలలు 221 దాకా ఉన్నాయి. సమావేశం ఉంటుందని ఆర్‌ఐఓ అందరికీ సమాచారం పంపారు. పత్రికల ద్వారా కూడా మెసేజ్ పంపారు. అయినా కేవలం 50 శాతం మంది ప్రిన్సిపాళ్లు, పీడీలు హాజరయ్యారు.
క్రీడల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది. అధిక ప్రాధాన్యత కలిగిన సమావేశానికి ఇంత తక్కువ మంది హాజరుకావడం బాధాకరమని ఆర్జేడీ వెంకటరమణ వాపోయారు. సమావేశంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజారాం, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు, అధ్యక్షులు సురేష్, ఏడీజేసీఏఏ కార్యదర్శి ఎ. నాగార్జునప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.