
నడి రోడ్డుపై సజీవ దహనం
కరీంనగర్ జిల్లా రామగుండం మండలం పొట్యాల, సోమనపల్లి గ్రామాల మధ్య ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
రామగుండం: కరీంనగర్ జిల్లా రామగుండం మండలం పొట్యాల, సోమనపల్లి గ్రామాల మధ్య ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోలో ఉన్న పెట్రోల్ క్యాన్ వల్ల మంటలు చెలరేగినట్లు సమాచారం. బెల్లంపల్లికి చెందిన మోహన్ అనే వ్యక్తి కుక్కల గూడూరులో ఉంటున్న బంధువు ఇంట్లో ఫంక్షన్కు హాజరై తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటో, కారు పూర్తిగా కాలిపోయాయి.
మృతుల్లో ఆటో డ్రైవర్ ఉప్పులేటి రాజేందర్, కారు డ్రైవర్ వెంకటేశ్‌తోపాటు అంజద్, మోహన్, మదనమ్మలు ఉన్నారు. మృతదేహాలు బాగా కాలిన స్థితిలో గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. మరో ముగ్గురికి తీవ్రగాయాలవ్వడంతో గోదావరిఖని ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తున్నారు.