ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు
కారును ఢీకొన్న లారీ.. షిర్డీ వెళ్తూ ముగ్గురి మృతి
కొండాపూర్: స్నేహితులందరూ కలిసి షిరిడీ దైవదర్శనం కోసం బయలుదేరి ప్రమాదవశాత్తూ మృత్యువాతపడ్డారు. కారులో తెల్లవారు జామున 3 గంటలకు బయలుదేరి గంటపాటు ప్రయాణించిన తర్వాత ఎదురుగా వస్తున్న లారీ మత్యువు రూపంలో వచ్చి ఢీకొట్టింది. దీంతో సంఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం మండల పరిధిలోని మల్కాపూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనకు సంబంధించి కొండాపూర్ సీఐ ఆంజనేయులు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
రామచంద్రాపురం మండలంలోని శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన శేఖర్ (35), వెంకటేశంచారి (33), కుమార్(33), చంద్రశేఖర్‌చారి (35), వెంకట్‌చారి (35)లు స్నేహితులు. శేఖర్ ఎలక్ర్టిషియన్‌గా పని చేస్తున్నాడు. కుమార్ బీహెచ్‌ఈఎల్‌లో కేబుల్ ఆపరేటర్, వెంకటేశంచారి కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మిగతా ఇద్దరితో కలిసి షిరిడీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో బుధవారం ఉదయం 3 గంటలకు కారు(ఏపీ09బీఎక్స్7117)లో బయలుదేరి కొండాపూర్ మండలం మల్కాపూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారి దగ్గరకు చేరుకోగానే ఉదయం 4 గంటల ప్రాంతంలో బీదర్ నుంచి ఎదురుగా వస్తున్న జీడీ12వై7654 నంబర్‌గల లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే కుమార్, వెంకటేశంచారి, శేఖర్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన చంద్రశేఖర్, వెంకట్‌చారిలను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడు కుమార్ సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.