ఒకే ఇంట్లో రెండోసారి చోరీకి యత్నం
Published Tue, Aug 16 2016 11:34 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
నల్లబెల్లి : మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పొగాకు అచ్చయ్య ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు పొగాకు అచ్చయ్య తన స్వగ్రామం నందిగామకు శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. సోమవారం రాత్రి ఒక్కడే ఇంటికి తిరిగొచ్చాడు. ఇంటి తాళం తీసి లోపలికి ప్రవేశించగా, తెరిచిన బీరువా, చిందరవందరగా పడేసిన దుస్తులు కనిపించాయి. ఆభరణాలు, నగదు కోసం వెతికిన దొంగలు ఏమీ దొరకకపోవడంతో మళ్లీ తాళం వేసి వెళ్లిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. గత 20 రోజుల వ్యవధిలో ఆ ఇంట్లో చోరీకి యత్నించడం ఇది రెండోసారి. అచ్చయ్య ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని ఎస్సై మేరుగు రాజశేఖర్ సందర్శించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో గాలింపు చేపట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అయితే పోలీస్ డాగ్ స్థానికంగా ఉన్న ఓ బెల్టుషాపు వద్దకు వెళ్లి ఆగడం గమనార్హం.
Advertisement
Advertisement