రౌడీ షీటర్ హత్య
రౌడీ షీటర్ హత్య
Published Tue, Sep 20 2016 8:53 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
కుమార్తెపై అత్యాచారం చేయబోగా దాడి చేసిన తండ్రి
పాతూరులో సంచలనం
పాతూరు (తాడేపల్లి రూరల్): ప్రశాంతంగా ఉండే పాతూరు గ్రామం ఓ రౌడీ షీటర్ హత్యతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొల్లూరుకు చెందిన రౌడీషీటర్ మంగళవారం తెల్లవారుజామున గ్రామానికి వచ్చి భర్త చనిపోయిన స్త్రీపై అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించగా ఆమె తండ్రి అతనిని వెంబడించి దాడి చేయడంతో మృతి చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం... పాతూరులో నివాసం ఉండే పాతూరు బాలస్వామి అలియాస్ బాబురావు పెద్దకుమార్తె జయంతికి కొల్లూరులోని ఆలపాటి నాగరాజుతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. సంవత్సరం క్రితం నాగరాజు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కొల్లూరులో రౌడీషీటర్ అయిన కనపర్తి నాగరాజు (35) భర్త చనిపోయిన తర్వాత జయంతిని తనతో ఉండాలని కోరాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తరచూ వేధించసాగాడు. ఈక్రమంలో నాగరాజు వేధింపులకు తాళలేక ఆమె పాతూరులోని తన పుట్టింటికి వచ్చేసింది. అయితే.. జయంతి పుట్టింటి చిరునామా చెప్పాలని ఆమె మామ ఇసాక్‌ను నాగరాజు వేధించాడు. సోమవారం రాత్రి ఇసాక్ ఇంటికి వెళ్లి జయంతి ఇల్లు చూపించాలని దాడి చేశాడు. తన ద్విచక్ర వాహనంపై ఇసాక్‌తో తాడేపల్లి మండలం పాతూరు గ్రామానికి చేరుకున్నాడు. జయంతి ఇంటికి వచ్చి వరండాలో నిద్రిస్తున్న ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఆమె పెద్దగా కేకలు పెట్టడంతో పక్కనే నిద్రిస్తున్న జయంతి తండ్రి బాబురావు లేచి నాగరాజుపై కత్తితో దాడి చేశాడు. దీంతో భయపడిన నాగరాజు ద్విచక్ర వాహనంపై ఉడాయించాడు. వాహనంపై కరకట్టవైపుగా వెళ్లి కృష్ణానదిలో ఇసుక రహదారిపై పారిపోవడానికి ప్రయత్నించగా వాహనం నది డొంకల్లో ఆగిపోయింది. అతన్ని వెంబడించి వెళ్లిన బాబురావు నాగరాజుపై కత్తితో మరోసారి దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాబురావు కత్తితో దాడిచేశాడని, దాడిలో రౌడీషీటర్ నాగరాజు అక్కడిక్కడే మృతిచెందినట్లు తాడేపల్లి పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాబురావు పరారీలో ఉన్నాడు.
జయంతి భర్తకూ వేధింపులు..
గతంలో కొల్లూరులో జరిగిన చిన్న సంఘటన ఆధారంగా రౌడీషీటర్ నాగరాజు జయంతి భర్త నాగరాజును చంపుతానని బహిరంగంగా బెదిరించాడని, భర్తను వేధించి హత్యచేసి ఉరివేసుకున్నట్లుగా చిత్రీకరించాడని తెలిసినా అతనిపై కనీసం కేసు కూడా పెట్టలేకపోయామని జయంతి బంధువులు ఆరోపిస్తున్నారు.
Advertisement