ఆర్టీసీ ఎన్నికలు నేడే | RTC gears up for elections | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఎన్నికలు నేడే

Published Mon, Jul 18 2016 6:26 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

ఆర్టీసీ ఎన్నికలు నేడే - Sakshi

ఆర్టీసీ ఎన్నికలు నేడే

నిజామాబాద్‌ నాగారం : ఆర్టీసీలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. జిల్లాలో 3,064 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ప్రచార ఘట్టం పరిసమాప్తమైంది. గత వారం రోజుల నుంచి ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన యూనియన్ల నేతలు.. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ), తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ) మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. రెండు యూనియన్లు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
రాత్రి 7 తర్వాత ఫలితాలు..
నిజామాబాద్‌ డిపో–1, 2, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్‌ డిపోలలో పోలింగ్‌ ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. బ్యాలెట్‌ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించున్నారు. రాష్ట్రానికి, రీజియన్‌కు సంబంధించి ప్రతి కార్మికుడు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. రాత్రి 7 గంటల నుంచి కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ప్రతి డిపోకు ప్రిసైడింగ్‌ ఆఫీసర్, ఇద్దరు పోలింగ్‌ అధికారులను కేటాయించారు. వారంతా వెంటనే విధుల్లోకి చేరాలని లేబర్‌ కమిషనర్‌ ఆదేశించారు.
ముఖ్య నేతల ప్రచారం కలిసొచ్చేనా..?
ఎన్నికల్లో గెలుపు కోసం ఈయూ, టీఎంయూ ముఖ్య నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. వారి ప్రచారం ఓటర్లపై ఎంత మేరకు ప్రభావం చూపనుందనేది చర్చనీయాంశంగా మారింది. ఈయూ రాష్ట్ర నేతలు రాజిరెడ్డి, బాబు జిల్లాలోని అన్ని డిపోల్లో పర్యటించారు. మరోవైపు టీఎంయూ కీలక నేతలు తిరుపతయ్య, అశ్వద్ధామరెడ్డి కూడా జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహించి, ఓట్లేయాలని అభ్యర్థించారు. ప్రచారంలో రెండు యూనియన్లు ప్రత్యర్థులపై భారీగా విమర్శలు గుప్పించాయి. పెండింగ్‌ బకాయిలు సహా వివిధ అంశాలపై జోరుగా ప్రచారం చేశాయి.
ఈయూకు ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ అండ..
ఈయూకు ఎస్‌డబ్ల్యూఎఫ్‌ మొదటి నుంచి మద్దతుగా నిలుస్తుండగా, తాము కూడా అండగా ఉంటామని నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ రెండ్రోజుల క్రితం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈయూకు కలిసొచ్చే అవకాశముంది. కామారెడ్డి, బోధన్, నిజామాబాద్‌ డిపో–1లలో కచ్చితంగా గెలుస్తామని ఆ యూనియన్‌ నేతలు చెబుతున్నారు. ఇక ఆర్మూర్‌లో గట్టి పోటీనిస్తామని, బాన్సువాడలో మాత్రం పరిస్థితి ప్రతికూలంగా ఉందని భావిస్తున్నారు. మొత్తంగా రీజియన్‌లో మాత్రం గెలుపు తమదేనని చెబుతున్నారు.
ఒంటిరిగానే టీఎంయూ..
తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగింది. మిగతా యూనియన్ల కంటే తమకే ఎక్కువ మంది ఓటర్లు మద్దతు ఉందని, నిజామాబాద్‌ డిపో–1, 2, ఆర్మూర్, కామారెడ్డి, బోధన్‌లో కచ్చితంగా గెలుస్తామని నేతలు ధీమాగా చెబుతున్నారు. బాన్సువాడలో ఇప్పటికే గెలుపు ఖాయమైందని, రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇక్కడ వస్తుందని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు, అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ నేతల ప్రోత్సాహం టీఎంయూకు ఎంతో బలంగా మారింది.
సెల్‌ఫోన్లు తీసుకురావొద్దు..
పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఓటర్లు సెల్‌ఫోన్లు తీసుకొని పోలింగ్‌ కేంద్రాలకు రావొద్దు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఐడీ కార్డు తీసుకొని రావాలి. పోలింగ్‌ ముగిసిన రెండు, మూడు గంటల్లో ఫలితాలు వెల్లడిస్తాం.
– చతుర్వేది, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement