మాఫియా బరితెగింపు
మాఫియా బరితెగింపు
Published Fri, Aug 12 2016 11:54 PM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM
లేటరైట్ మాఫియా బరితెగిస్తోంది. నర్సీపట్నం ఆర్డీవో, గనులశాఖ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లేటరైట్ మట్టి తరలింపును ఆపేయాలన్న అధికారుల ఆదేశాలను పట్టించుకోవడం లేదు. రాజకీయనాయకుల అండతో టిప్పర్లలో శుక్రవారం వేరే చోటుకి తరలించేశారు.
నాతవరం : ఇటీవల నాతవరం మండలం సరుగుడు పంచాయతీలో లేటరైట్ తవ్వకాలపై వరుస కథనాలు సాక్షిలో ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈమేరకు నర్సీపట్నం ఆర్డీవో కె.సూర్యారావు లేటరైట్ తవ్వకాల ప్రాంతాన్ని పరీశీలించారు. అసమయంలో పెద్ద ఎత్తున నిల్వ చేసిన లేటరైట్ మట్టితో పాటు టిప్పర్లు, ఇతర యంత్రాలు ఉన్నాయి. అనుమతులు లేకుండా తవ్వకాలు చేపడుతున్నారంటూ, కలెక్టరు అదేశాలు వచ్చే వరకు వాహనాలు, లేటరైట్ మట్టిని తరలించరాదని సూచించారు. మిషనరీతో పాటు ఇక్కడ పని చేస్తున్న సిబ్బందిని సైతం వీడియో తీయాలంటూ తహసీల్దార్ కనకారావును ఆదేశించారు. దీనిపై రెవెన్యూ సిబ్బంది నిఘా పెట్టాలని ఆదేశించారు. గురువారం జియాజిస్టు తమ్మినాయుడు, మైనింగ్ ఆర్‌ఐ రమణ లేట్‌రైట్ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు వాహనాలు, మట్టి ఉన్నాయి. లేటరైట్ లీజును రద్దు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులను ప్రభుత్వానికి పంపామని, అక్కడ్నుంచి అదేశాలు వచ్చెంత వరకు తవ్వకాలు చేపట్టరాదని, వాహనాలు సైతం అక్కడే ఉంచాలని ఆదేశించారు. లేట్‌రైట్ మాఫీయా రుబాబు అండదండలతో శుక్రవారం తవ్వకాలు జరిపినట్లు స్థానికుల సమాచారంతో రెవెన్యూ అధికారులు క్వారీపై దాడి చేశారు. అప్పటికే వాహనాలు మాయమయ్యాయి. దీని గురించి క్వారీలో ఉన్న సూపర్‌వైజర్ దొరబాబును అధికారులు ఆరా తీశారు. ఆయన నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆర్‌ఐ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంటు సోమశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఆర్టీవో సూర్యారావు వద్ద ప్రస్తావించగా మాఫియా ఆగడాలను జిల్లా కలెక్టర్ దష్టిలో పెట్టామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. వాహనాలను తరలించుకుపోయినప్పటికీ, వాటి నంబర్లను ముందుగా సేకరించి ఉంచామన్నారు. వాటిని సీజ్ చేస్తామని తెలిపారు.
Advertisement