- మంత్రివర్గ సమావేశంలో చర్చ
- తుది నోటిఫికేషన్‌పై ఉత్కంఠ
రూరల్ జిల్లా ఉంటుందా..
Published Sat, Oct 8 2016 1:04 AM | Last Updated on Mon, Dec 3 2018 1:54 PM
సాక్షిప్రతినిధి, వరంగల్ :
రోజుకో తీరుగా మారుతున్న జిల్లాల పునర్విభజన ప్రక్రియపై సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేయనున్న తుది నోటిఫికేషన్‌లో ఎన్ని జిల్లాలు ఉంటాయనే అంశం ఆసక్తికరంగా మారింది. ములుగు జిల్లా డిమాండ్‌తో ఉద్యమం తీవ్రమైన నేపథ్యంలో... వరంగల్ రూరల్ జిల్లా ప్రతిపాదన ఉంటుందా అనే అంశంపై చర్చ జరుగుతోంది. జిల్లాల పునర్విభజన తుది ముసాయిదాపై శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. వరంగల్ జిల్లా పునర్విభజనలో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాలుగా ఏర్పాటయ్యేలా ప్రతిపాదనలు ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటు అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసింది. వరంగల్ రూరల్ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనపై ఏ వర్గంలోనూ ఆసక్తి లేదని వివరించినట్లు సమాచారం. వరంగల్ నగరానికి సమీపంలో ఉండే ప్రాంతాలను వేరే జిల్లాగా చేయడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని పలువురు జిల్లా ప్రజాప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దృష్టికి అంతకుముందు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ములుగు జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను పరిశీలించాని మంత్రి అజ్మీరా చందూలాల్ మరోసారి కోరినట్లు తెలిసింది. ఇలా ములుగు జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్.. వరంగల్ రూరల్ జిల్లా అవసరం లేదని ప్రతిపాదనల నేపథ్యంలో జిల్లాల పునర్విభజన తుది ముసాయిదాపై ఆసక్తి పెరుగుతోంది. వరంగల్ జిల్లాలో కొత్తగా నాలుగు జిల్లాలు ఉంటాయా, ఐదు జిల్లాలు ఉంటాయా, ఏ జిల్లాలు ఉంటాయనే ఉత్కంఠకు ఒకటి రెండు రోజుల్లో జారీ చేయనున్న తుది నోటిఫికేషన్‌తో తెరపడనుంది.
Advertisement
Advertisement