ఆర్టీసీలో సురక్షిత ప్రయాణం
-
33 మంది ప్రమాద రహిత డ్రైవర్లకు సన్మానం
నెల్లూరు (టౌన్):
సురిక్షిత ప్రయాణానికి ఆర్టీసీ చిరునామని ఏఎస్పీ శరత్‌బాబు తెలిపారు. బుధవారం స్థానిక ఆర్టీసీ డిపో–1 గ్యారేజిలో ప్రమాద రహిత వారోత్సవాలు ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శరత్‌బాబు మట్లాడుతూ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం వాహనాల సంఖ్య పెరిగిందన్నారు. రోడ్డు నిబంధనలపై ప్రజల్లో అవగాహన లేక ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. వాహనాలను కండిషన్‌లో ఉంచడంతో పాటు డ్రైవర్లు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ప్రాంతీయ రవాణాశాఖాధికారి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఏడాదికి రోడ్డు ప్రమాదాల్లో 15వేల మందికి పైగా మృతి చెందుతున్నారన్నారు. ఇది తుపాన్, సునామిలాంటి వాటికన్నా ఎక్కువుగా ఉందన్నారు. ట్రాఫిక్ రూల్స్ పట్ల ప్రజల్లో చైతన్యం వస్తే తప్ప ప్రమాదాలు తగ్గే అవకాశం లేదన్నారు. ఆర్టీసీఈడీ రవీంద్రబాబు మాట్లాడుతూ 2015–16కు సంబంధించి నెల్లూరు రీజియన్‌లో ప్రమాదాల్లో మృతిచెందిన కుటుంబాలకు రూ.2 కోట్ల పరిహారం చెల్లించినట్లు తెలిపారు. ఒక్క ప్రమాదం కూడా చేయని 33 మంది డ్రైవర్లను ఘనంగా సన్మానించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్‌ఎం రవివర్మ, డిపో–1, డిపో–2 మేనేజర్లు శీనయ్య, సీఐలు పాల్గొన్నారు.