నిరంతర సాహితీ సంచారి విహారి
విజయవాడ కల్చరల్ : నిరంతర సాహితీ సంచారి విహారి (జేఎస్ మూర్తి) అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. విజయవాడ సాహితీ సంస్థలు, సాహితీ మిత్రుల సంయుక్త నిర్వహణలో మొగల్రాజపురంలోని మధుమహాలక్ష్మి కాంప్లెక్స్‌లో ఆదివారం ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత, పదచిత్ర రామాయణకర్త విహారి 60 వసంతాల సాహితీ జీవితం పూర్తి చేసుకున్న నేపథ్యంలో సాహిత్య షష్టిపూర్తి సదస్సును నిర్వహించాయి. సదస్సుకు కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు అధ్యక్షత వహించారు. సాహితీవేత్త మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడుతూ విహారి భావఝరి పదచిత్ర రామాయణం కమనీయంగా సాగుతుందని చెప్పారు. లయోలా కళాశాల వైస్ ప్రిన్సిపాల్, తెలుగు అధ్యాపకుడు గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ విహారి సాహిత్య జీవితం ఎంతోమంది వర్ధమాన రచయితలను సాహిత్యం వైపు మళ్లించిందని తెలిపారు. చినుకు సంపాదకుడు నండూరి రాజగోపాల్ మాట్లాడుతూ విహారి తెలుగు కథా సాహిత్య విహారి అని అభివర్ణించారు. సదస్సులో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్, కోశాధికారి కలిమిశ్రీ, కవి పండితులు పువ్వాడ తిక్కన సోమయాజి, ప్రజాసాహితీ సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు, విరసం బాధ్యుడు అరసవల్లి కృష్ణ తదితరులు ప్రసంగించారు. నిర్వాహకులు భావఝరి పదచిత్ర రామాయణం పుస్తకాన్ని ఆవిష్కరించి, విహారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విహారి మాట్లాడుతూ 60 ఏళ్ల సాహిత్య జీవితంలో అనేక అంశాలను ప్రస్థావించారు. కార్యక్రమ సమన్వయకర్తలుగా కావూరి సత్యవతి, బొడ్డపాటి చంద్రశేఖర్ వ్యవహరించారు.