మృత్యువుతో పోరాడి ఓడింది | sai pravallika dead in gandhi hospital | Sakshi
Sakshi News home page

మృత్యువుతో పోరాడి ఓడింది

Published Wed, Feb 8 2017 2:22 AM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

సాయిప్రవల్లిక మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు

సాయిప్రవల్లిక మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు

గాంధీ ఆసుపత్రిలో కన్నుమూసిన ప్రవల్లిక
పురుగు అవశేషం ఉన్న సెలైన్‌ వల్లే మా కుమార్తె చనిపోయింది
గాంధీ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే మా పాప దూరమైంది
మంత్రికి మొరపెట్టుకుంటే మాపైనే కేసు పెడతామని బెదిరించారు
సాయిప్రవల్లిక తల్లిదండ్రుల ఆరోపణ
ఆమెది సహజ మరణమే.. ఎవరినీ బెదిరించలేదు: మంత్రి లక్ష్మారెడ్డి  


హైదరాబాద్‌/కొడకండ్ల(పాలకుర్తి): అరుదైన ‘న్యూరోనల్‌ సెరాయిడ్‌ లిపో ప్యూసినోసిస్‌’అనే వ్యాధితో బాధపడుతూ గాంధీ ఆసుపత్రిలో చేరిన చిన్నారి సాయి ప్రవల్లిక(6) రెండు నెలల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయింది. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున కన్నుమూసింది. ఆమెకు వైద్యం అందజేసే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గాంధీ వైద్యులు పురుగు అవశేషం ఉన్న సెలైన్‌ ఎక్కించిన సంగతి తెలిసిందే. ప్రవల్లిక ఆరోగ్యం మరింత క్షీణించి చివరకు మృత్యు ఒడికి చేరుకుందని ప్రవల్లిక తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి మొరపెట్టుకుంటే.. తనపైనే కేసు పెడతామని బెదిరించారని చెప్పారు. అయితే ప్రవల్లికది సహజ మరణమే అని, తాము ఎవరినీ బెదిరించలేదని మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.

‘సెలైన్‌’పై ముగ్గురితో కమిటీ
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మైదంచెరువు తండాకు చెందిన భిక్షపతి, సుమలత దంపతుల కుమార్తె సాయిప్రవల్లిక మెదడు సంబంధిత ‘న్యూరోనల్‌ సెరాయిడ్‌ లిపో ప్యూసినోసిస్‌’వ్యాధితో బాధపడుతోంది. గతేడాది డిసెంబర్‌ 7న గాంధీ ఆసుపత్రి చిన్నపిల్లల విభాగంలోని పీఐసీయూలో ప్రవల్లికను చేర్చుకున్నారు. అదే నెల 15వ తేదీన చిన్నారికి ఎక్కించిన సెలైన్‌ బాటిల్లో పురుగు అవశేషం ఉన్నట్లు తండ్రి భిక్షపతి గుర్తించారు. ఈ ఉదంతం అప్పట్లో సంచలనం సృష్టించడంతో వైద్యుల నిర్వాకంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. దీంతో సెలైన్‌ బాటిల్‌లోని ద్రావకాన్ని లేబోరేటరీకి పంపారు. పుణేలోని ప్రెసినియస్‌కాబీ సంస్థ డెక్స్‌ట్రోస్‌ 10%(500 ఎంఎల్‌) సెలైన్‌ బాటిల్‌ తయారు చేసింది. పురుగు అవశేషం ఉన్న సెలైన్‌ బాటిల్‌ ఎక్కించడంతోనే బాలిక ప్రాణాపాయస్థితికి చేరుకుందని ప్రవల్లిక తల్లిదండ్రులు ఆరోపించడంతో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ముగ్గురు వైద్య నిపుణులతో కమిటీ వేశారు. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగుతుండగానే చిన్నారి సాయిప్రవల్లిక కన్నుమూసింది.

ప్రవల్లికది సహజ మరణం..: మంత్రి లక్ష్మారెడ్డి
గాంధీ ఆసుపత్రిలో మృతిచెందిన ప్రవల్లికది సహజ మరణమని, ఆమెకు ప్రాణాంతక ‘న్యూరో నల్‌ సెరాయిడ్‌ లిపో ప్యూసినోసిస్‌’వ్యాధి ఉందని మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆమెకు న్యూమోనియా, ఫిట్స్, లంగ్స్‌ ఇన్‌ఫెక్షన్‌ వంటి సమస్యలున్నాయన్నారు. 4 నెలల క్రితం గాంధీలో అడ్మిట్‌ అయిందని, అప్పుడు కొంత నయమై డిశ్చార్జ్‌ అయిందని, ఆ తర్వాత ప్రైవేట్‌ ఆసుపత్రు ల చుట్టూ తిరిగారని చెప్పారు. ఆమె వ్యాధి లక్షణాలను బట్టి 6 నుంచి 12 ఏళ్ల లోపు మరణం తప్పదని తేల్చడంతో తిరిగి గాంధీలో చేర్చారన్నా రు. 63 రోజులుగా ప్రవల్లికకు గాంధీలో వైద్యం జరుగుతోందన్నారు. మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న ఆమె మంగళవారం మృతి చెందిం దన్నారు. తామెవరూ ప్రవల్లిక తల్లిదండ్రులను బెదిరించలేదని, వారికి సాయం చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. కాగా, ప్రవల్లికది సహజ మరణమేనని గాంధీ సూపరింటెండెంట్‌ జేవీ రెడ్డి తెలిపారు. ఆమెకు వచ్చిన అరుదైన వ్యాధి వల్ల రెండేళ్ల కంటే ఎక్కువ బతకలేదని గతం లోనే వైద్యులు పలు పరీక్షలు చేసిన అనంతరం నిర్థారించినట్లు పేర్కొన్నారు. పురుగు అవశేషం ఉన్న సెలైన్‌పై విచారణ కొనసాగుతోందని, ఇంకా నివేదిక అందలేదని అన్నారు.

మాపైనే కేసు పెడతామని బెదిరించారు మంత్రిపై సాయిప్రవల్లిక తల్లిదండ్రుల ఆరోపణ
గాంధీ వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప మృతి చెందిందని సాయిప్రవల్లిక తల్లిదండ్రులు భిక్షపతి, సుమలత ఆరోపించారు. పురుగు అవశేషంతో కూడిన సెలైన్‌ ఎక్కించాక తమ పాప ఆరోగ్యం మరింత క్షీణించిందని, పాపను వేరే ఆసుపత్రిౖMðనా మార్చి కాపాడాలని పలుమార్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను వేడుకున్నా పట్టించుకోలేదని చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి కాళ్లపై పడి తమ బిడ్డను కాపాడాలని, మెరుగైన వైద్యం చేయించాలని వేడుకుంటే.. ‘తప్పుడు ఆరోపణలు చేస్తూ బదనాం చేయాలని చూస్తున్నారు. మీపై కేసు పెడతాం’అని అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ జరిపి తమకు న్యాయం చేయాల్సిన వారు ఏమాత్రం పట్టించుకోలేదని, రెండు నెలలు కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని ఆసుపత్రిలో పడిగాపులు కాస్తే.. చివరకు బిడ్డ మృతదేహాన్ని అందించారని వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఆరోగ్యం బాగాలేకనే మీ బిడ్డ చనిపోయింది.. లొల్లి చేయకుండా తీసుకెళ్లాలని అక్కడి సీఐ ఫోన్‌లో తమను హెచ్చరించి పంపించారని ఆరోపించారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇతర వైద్య ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఉంటే ప్రవల్లిక బతికేదని, ఇప్పుడు తన కూతురు ప్రాణాలు తెచ్చి ఇవ్వగలరా అని ప్రశ్నించారు. కాగా, విషతుల్యమైన సెలైన్‌ ఎక్కించడం వల్లే బాలిక మృతి చెందిందని, ఆమె కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement