ఇలవేల్పుకు భక్తకోటి హృదయాంజలి
భగవాన్ సత్యసాయికి అశేష భక్తకోటి హృదయాంజలి సమర్పించింది. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన వేలాది భక్తుల నడుమ సత్యసాయి ఆరాధనోత్సవాలు సోమవారం ప్రశాంతి నిలయంలో భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఉదయం సత్యసాయి విద్యార్థుల వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తులు కర్ణాటక శాస్త్రీయ సంగీత రీతులలో సత్యసాయిని కీర్తిస్తూ పంచరత్న కీర్తనలు ఆలపించారు.
- పుట్టపర్తి టౌన్
సత్యసాయి నిత్యాన్నదాన పథకం
ఈ సందర్భంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు నాగానంద, ఆర్‌జె.రత్నాకర్‌రాజు ప్రసంగిస్తూ.. ఆర్థించే ప్రతి ఒక్కరికీ సత్యసాయి ప్రేమను పంచారని గుర్తు చేశారు. ఇటీవల ప్రారంభించిన సత్యసాయి విద్యాజ్యోతి పథకం కూడా మంచి పలితాలను ఇస్తోందన్నారు. సత్యసాయి ఆకాంక్షల మేరకు గురుపౌర్ణమి పర్వదినం నుంచి ప్రశాంతి నిలయంలో సత్యసాయి నిత్యాన్నదాన పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
సేవా కార్యక్రమాలు విస్తృతం
సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమిష్ పాండ్య మాట్లాడుతూ.. సత్యసాయి సర్వాంతర్యామి అని అయన భౌతికంగా భక్తుల నడుమ లేకపోయినా ఆయన ఆశయాల కొనసాగింపే లక్ష్యంగా ప్రతి భక్తుడూ కృషి చేయాలన్నారు. సత్యసాయి సంకల్ప బలంతో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్లు పేర్కొన్నారు. సత్యసాయి విద్యాజ్యోతి పథకంలో భాగంగా దేశీయంగా 672 పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు గుర్తు చేశారు. ఇందులో 1.39 లక్షల మంది విద్యార్థులకు 6,500 ఉపాధ్యాయులు మానవతా విలువలతో కూడిన విద్యాబోధనలు అందిస్తున్నారని అన్నారు.
40 వేల మందికి అన్నవస్త్రాల వితరణ
ఆరాధనోత్సవాలలో భాగంగా పుట్టపర్తిలోని సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియంలో మహానారాయణ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పుట్టపర్తి పరిసర ప్రాంతాలకు చెందిన 40 వేల మంది వేకువజామునే స్టేడియంకు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు స్టేడియం వేదిక వద్ద సత్యసాయి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు సత్యసాయి సేవాదల్ సభ్యులు అన్నప్రసాదాలు, నూతనవస్త్రాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌జే రత్నాకర్‌రాజుతో కలిసి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి భక్తులకు సత్యసాయి అన్నప్రసాదాలు, నూతన వస్త్రాలను వితరణ చేశారు. అదే విధంగా ప్రశాంతి నిలయంలోని ఉత్తర మైదానంలో కూడా అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. వేడుకలలో కర్ణాటక మంత్రి రమేష్, మాజీ మంత్రి గీతారెడ్డి, సత్యసాయి ట్రస్ట్ సభ్యులు విజయభాస్కర్, చక్రవర్తి, ఏపీ మిశ్రా, ప్రసాద్‌రావు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అలరించిన అనంతనారాయణన్ కచేరి
సోమవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత తమిళనాడుకు చెందిన అనంతనారాయణన్ బృందం సంగీత కచేరి అలరించింది. పిదప కళాకారులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
సత్యసాయి సేవాలు వెలకట్ట లేనివి
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో నీటి ఎద్దడి నివారించడం సత్యసాయికే సాధ్యమైందన్నారు. ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను సత్యసాయి చేసి చూపించారని కొనియాడారు.