జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడిని సమష్టిగా పరిష్కరిద్దామని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ హారేరామ్‌నాయక్ సిబ్బందిని ఆదేశించారు.
అనంతపురం సిటీ : జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడిని సమష్టిగా పరిష్కరిద్దామని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ హారేరామ్‌నాయక్ సిబ్బందిని ఆదేశించారు. ‘గుటకలేశాకే..గుక్కెడు నీరు’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై ఆయన స్పందించారు. శుక్రవారం ఆయన తన చాంబర్‌లో జిల్లాలోని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ హరేరామ్‌నాయక్ మాట్లాడుతూ నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. తీవ్ర తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. సమీప ప్రాంతాల్లోని పొలాల్లో నీరు ఉంటే సంబంధిత రైతును ఒప్పించి, అక్కడి నుంచి నీటిని సరఫరా చేసేందుకు ప్రయత్నించాలన్నారు.
అవసరమైతే తాత్కాలిక పైప్‌లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. సమస్య తీవ్రం ఉంటే వెంటనే జిల్లా కార్యాలయానికి సమాచారం ఇవ్వాలన్నారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో ఎక్కడ తాగునీటి సమస్య ఉత్పన్నమైనా ఆర్‌డబ్ల్యూఎస్ శాఖనే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అందువల్ల ప్రజలకు సురక్షిత నీటిని అందించేందుకు ప్రతి ఉద్యోగీ పని చేయాలన్నారు. జిల్లాలో నెలకొన్న నీటి సమస్యను అధిగమించేందుకు ఈ నెల 17న ఫోన్‌ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులను ఆయా సబ్ డివిజినల్ కార్యాలయాలకు పంపుతామన్నారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ప్రజలు కూడా ఈనెల 17న 08554 -275769 నంబర్‌కు ఫోన్ చేసి, నీటి సమస్య తెలియజేయాలన్నారు.