
సారథి లేక.. జీతాలు రాక..!
– నెల రోజులుగా సెలవులో ఐసీడీఎస్ పీడీ
– తాజాగా రెండు నెలల గడువు పొడిగింపు
– ఉద్యోగులకు అందని జూలై వేతనాలు
అనంతపురం టౌన్: మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆగస్టు ప్రారంభమై ఐదు రోజులు దాటినా ఇంకా వేతనాలు పడని పరిస్థితి. అసలు వేతనాలు పడుతాయా లేక మరోరెండు నెలలపాటు వేచి ఉండాల్సి వస్తుందా అన్నదిక్కుతోచని స్థితిలో ఉద్యోగులు ఉన్నారు. జిల్లాలో 17 సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) ప్రాజెక్టులుండగా అన్ని కార్యాలయాల్లోని ఉద్యోగుల జీతాల బిల్లులపై ఆయా ప్రాజెక్టుల్లోని సీడీపీఓ (డ్రాయింగ్ ఆఫీసర్లు)లే సంతకాలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల్లోని ఉద్యోగులకు ఎలాంటి సమస్య లేదు.
అయితే అనంతపురంలోని మహిళా శిశు సంక్షేమశాఖ ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు మంజూరు కావాలంటే డ్రాయింగ్ ఆఫీసర్‌గా ఉన్న ప్రాజెక్ట్ డైరెక్టర్ సంతకం తప్పనిసరి. ఇక్కడ పీడీగా ఉన్న జుబేదాబేగం రెండు నెలల క్రితం కర్నూలుకు బదిలీపై వెళ్లారు. దీంతో ఏపీడీగా ఉన్న ఉషాఫణికర్‌కు పీడీగా ఎఫ్‌ఏసీ ఇచ్చారు. నెల క్రితం ఆమె సైతం సెలవు పెట్టారు. కుటుంబ సభ్యులకు అనారోగ్యంగా ఉన్న కారణంగా సెలవులో వెళ్లిన ఆమె తాజాగా మరో రెండు నెలల పాటు సెలవు పొడిగించుకున్నారు. ఇప్పటికే అనంతపురం అర్బన్ ప్రాజెక్ట్ సీడీపీఓగా ఉన్న కృష్ణకుమారికి తాత్కాలిక ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ వీరపాండియన్ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ఈమెకు చెక్‌పవర్ లేని కారణంగా ప్రస్తుతం తన ప్రాజెక్టులో మినహా ప్రధాన కార్యాలయంలోని ఉద్యోగుల జీతాల బిల్లులపై సంతకం చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ కార్యాలయంలో నలుగురు సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఒక టైపిస్ట్, ఒక వాచ్‌మన్, ఇద్దరు అటెండర్లు, ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులున్నారు. ప్రతి నెలా వీరి జీతాల కోసం రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు చెల్లిస్తున్నారు. పీడీ లేని పక్షంలో ఏపీడీ ఉన్నా జీతాల మంజూరుకు వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం ఇద్దరూ లేకపోవడంతో ఉద్యోగులకు జీతాల వెతలు తప్పేలా లేదు.
పీడీగా ఉన్న ఉషాఫణికర్ కూడా సెలవు పొడిగించుకున్న నేపథ్యంలో అన్ని రోజులు వేతనాల కోసం ఎదురుచూడాలా అన్న సందేహం ఉద్యోగుల్లో నెలకొంది. ఇదిలా ఉండగా ఐసీడీఎస్ పీడీగా వెంకటేశం వస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా ప్రస్తుతం వెంకటేశం జిల్లా యువజన సంక్షేమ అధికారిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ వీరపాండియన్ ప్రత్యేక దృష్టి సారిస్తే అటు ఉద్యోగుల సమస్యలతో పాటు అంగన్‌వాడీల బలోపేతం జరిగే అవకాశం ఉంది.