భక్తులకు ఇబ్బంది కలిగించొద్దు
-
ఇంద్రకీలాద్రిపై డీసీపీ సెంథిల్ పర్యటన
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : కృష్ణా పుష్కరాల్లో దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని డీసీపీ ఎస్.సెంథిల్‌కుమార్ దుర్గగుడి అధికారులను ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లపై గురువారం ఆయన ఆలయ ఇంజినీరింగ్ అధికారులు, ఏసీపీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత దుర్గగుడి అధికారులు చేస్తున్న ఏర్పాట్లను ఏఈవో అచ్యుతరామయ్య, రామమోహనరావు, ఈఈలు శ్రీరామకృష్ణ ప్రసాద్ కోటేశ్వరరావు, నూకరత్నంతో చర్చించారు. అనంతరం అమ్మవారి దర్శనం నిమిత్తం దేవస్థానం ఏర్పాటుచేస్తున్న క్యూలైన్లు, ఆలయ ప్రాంగణంలో కొబ్బరి కాయలు కొట్టే ప్రదేశంలో చేయాల్సిన మార్పుల గురించి చర్చించుకున్నారు. అమ్మవారి దర్శనానికి లక్షలాదిగా వచ్చే భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనం కలిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం కనకదుర్గానగర్‌ను పరిశీలించారు.
వైభవంగా ఆడి కృత్తిక మహోత్సవం
ఇంద్రకీలాద్రిపై శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో గురువారం ఆడి కృత్తిక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో నిర్వహించిన దీపోత్సవంలో ఆలయ ఏఈవో అచ్యుతరామయ్య పాల్గొన్నారు. తొలుత స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై తొలిసారి నిర్వహించిన ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయంలోని నాగపుట్ట వద్ద నిర్వహించిన దీపోత్సవంలో పాల్గొన్నారు.