మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై ఎమ్మెల్సీ శమంతకమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీల సమావేశాల్లో నేతలు ధిక్కార స్వరాన్ని వినిపించారు. సోమవారం అనంతపురంలోని కమ్మభవన్‌లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయ కమిటీల సమావేశాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగాయి. ఈ సందర్భంగా జిల్లా పరిశీలకుడు జయనాగేశ్వరరెడ్డి, మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి ఎదుట పలువురు నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సమావేశాలకు మీడియాను అనుమతించలేదు.
కొందరు నేతలు బయటకు వచ్చాక నేతల తీరును బాహాటంగానే విమర్శించారు. కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా తీరుపై నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట నేతృత్వంలో నేతలు ఆగ్రహించారు. స్టోర్ డీలర్లను తొలగించాలని, జన్మభూమి కమిటీలు రద్దు చేయాలని ఎమ్మెల్యే చెబుతున్నట్లు జయనాగేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్టీలో ఉంటూ ప్రొటోకాల్ పేరిట వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారన్నారు. ఇక ఎమ్మెల్సీ శమంతకమణి తనదైన శైలిలో మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారో.. ఎవరు చేయలేదో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల ఎంపికలో తమను సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.
దీంతో ఎవరి విషయంలో మాట్లాడుతున్నారని జయనాగేశ్వరరెడ్డి అడగ్గా.. వడ్డెర్ల కార్పొరేషన్ చైర్మన్‌గా మురళీని ఎవరిని అడిగి ఎంపిక చేశారని ప్రశ్నించారు. దీంతో మంత్రి పల్లె తానే వేయించానని చెప్పారు. ‘నువ్వొక్కడివే ఎలా నిర్ణయం తీసుకుంటావ’ని ఆమె ప్రశ్నించారు. ఇదే సమయంలో మంత్రి సునీత కూడా తనకు సమాచారం లేదన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, మరికొందరు కూడా గళం విప్పారు. ఉక్కిరిబిక్కిరైన మంత్రి పల్లె.. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని అడిగే ఇచ్చామని చెప్పారు. ఇవ్వాలా, వద్దా అని అడిగితే ఇవ్వండని చెప్పినట్లు చౌదరి అంగీకరించారు.
గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంత మంది నాయకులు కొన్ని సమావేశాల్లో మాత్రమే కన్పిస్తున్నారని, పార్టీ కోసం పని చేయడం లేదని అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలోనూ మంత్రి పల్లెపై ఫిర్యాదులు వెళ్లాయి. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి అడ్డుపడుతున్నారని, ప్రత్యేక వర్గాన్ని పెంచిపోషిస్తూ పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోవడం లేదని కొందరు నాయకులు ఫిర్యాదు చేశారు. మొత్తానికి చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాల రగలగా.. నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.